Earthquake : ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం(Earthquake) వచ్చింది. ముండ్లమూరు మండలం పరిసర ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం 1:43 గంటలకు భూమి కంపించింది. దాదాపు సెకను పాటు భూమి కంపించడంతో జనం భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. డిసెంబరు నెల మూడోవారం, నాలుగు వారంలోనూ ఇదే విధంగా ముండ్లమూరు మండలంలో భూ ప్రకంపనలు సంభవించాయి. మొత్తం మీద గత నెలలో ఈ మండలం పరిధిలో మూడుసార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో నాలుగుసార్లు భూమి కంపించడంతో మండల ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు.
Also Read :Indian Nurse : కేరళ నర్సుకు యెమన్‌లో మరణశిక్ష.. సాయం చేస్తానని ప్రకటించిన ఇరాన్ అధికారి
జనవరి 1న భూకంపం
న్యూ ఇయర్‌లో మొదటి రోజున (జనవరి 1న) ఉదయమే 10 గంటల 24 నిమిషాలకు గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భూకంపం వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు భయపడ్డారు. కచ్ జిల్లాకు ఉత్తర-ఈశాన్యం దిశగా 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికార వర్గాలు తెలిపాయి. 2024 సంవత్సరం నవంబర్ 18న కచ్‌లో 4 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Also Read :Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు
డిసెంబరు 8న నాలుగు రాష్ట్రాల్లో..
2024 సంవత్సరం డిసెంబరు 8వ తేదీన కొన్ని గంటల వ్యవధిలోనే దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రాలను గుజరాత్, మేఘాలయ, తమిళనాడు, కర్ణాటకల్లో గుర్తించారు. అంతకుముందు డిసెంబరు 6వ తేదీన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
డిసెంబరు 4న తెలుగు రాష్ట్రాల్లో..
డిసెంబరు 4న ఉదయం 7 గంటల 27 నిమిషాలకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలు 55 ఏళ్ల తర్వాత తొలిసారి భూకంపాన్ని ఫీలయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని హైదరాబాద్ ఎన్‌జీఆర్‌ఐలో ఉన్న భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది.ఈ భూకంప తరంగాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దు ప్రాంతాలను కూడా తాకాయి.