AP Elections : ఏపీలో ‘ముంద‌స్తు’ హీట్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో ఎన్నిక‌ల హీట్ మొద‌లైయింది.

  • Written By:
  • Publish Date - April 21, 2022 / 02:31 PM IST

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో ఎన్నిక‌ల హీట్ మొద‌లైయింది. అధికార‌ప‌క్షం వివిధ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి స్కెచ్ వేసింది. సీఎం జ‌గ‌న్ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డానికి సిద్ధం అయ్యారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండున్న‌రేళ్లుగా క్యాంపు ఆఫీస్‌కు ప‌రిమిత‌మైన జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంకో వైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి సిద్ధం అవుతోంది. ఆ పార్టీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు బ‌స్సు యాత్ర షెడ్యూల్ మ‌రో వారం రోజుల్లో వెల్ల‌డికానుంది. పాద‌యాత్ర చేయాల‌ని లోకేష్ రంగం సిద్ధం చేశారు.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభిస్తోంది . ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం 26 జిల్లాల్లో ఏడాది పొడవునా పర్యటనను డిజైన్ చేసింది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్‌కు ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం ముందు ఎన్నికల ప్రచారాలు ప్రారంభమవుతాయి. దీంతో రెండేళ్ల ముందుగానే ఏపీ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. త‌ర‌చూ ముందుస్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. అందుకే, ముందుగానే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఆయ‌న మొద‌లు పెట్ట‌నున్నారని తెలుస్తోంది.క్యాంపు కార్యాలయంలో సమీక్షలు, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లకే పరిమితమైన జగన్ మోహన్ రెడ్డి ప్ర‌స్తుతం ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అడుగుజాడల్లో నడవాలని జ‌గ‌న్‌ నిర్ణయించుకున్నారు. రాజశేఖర్ రెడ్డి జనంతో మమేకమయ్యేందుకు రచ్చబండ సభలు నిర్వహించారు. అదే త‌ర‌హాలో ర‌చ్చ‌బండ‌ను నిర్వ‌హించ‌డానికి జ‌గ‌న్ సిద్ధం అయ్యారు. ‘గడప గడపకు వైఎస్‌ఆర్‌సి’ (ఇంటింటి పర్యటన) కింద నెలలో కనీసం 10 గ్రామ సచివాలయాలు విజిట్ స్థానిక నేత‌లు చేస్తున్నారు. గ్రామాలను 20 రోజుల పాటు సందర్శించాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలని ముఖ్యమంత్రి శాసనసభ్యులందరికీ సూచించారు. వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్ర‌చారం చేయాల‌ని దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్ 7న నరసరావుపేటలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జ‌గ‌న్ టీడీపీ, జనసేన అధినేతల పై విరుచుకుప‌డ్డారు. దొంగలు, రాక్షసుల గుంపు వ‌స్తుంద‌ని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతిపక్ష నేత‌లు వెంట్రుక కూడా పీక‌లేరంటూ జ‌గ‌న్ రాజ‌కీయ వాతావర‌ణాన్ని వేడెక్కించారు. తాజాగా సూసైడ్ బ్యాచ్ రెడీ అయింద‌ని టీడీపీ లీడ‌ర్ బుద్ధా వెంక‌న్న వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. చంప‌డానికైనా, చ‌వ‌డానికైనా సిద్ధం అంటూ ఆయ‌న చేసిన ఘాటు వ్యాఖ్య‌లు దుమారాన్ని రేపుతున్నాయి. వాలంటీర్ల స‌న్మాన స‌భ‌ల‌కు హాజ‌రవుతోన్న జ‌గ‌న్ పరిపాల‌న ప‌రంగా సంస్క‌ర‌ణ‌ల‌ను వేగంగా చేస్తున్నారు. మొత్తం మీద అటు అధికార ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఏపీలోని రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని ఎన్నిక‌ల దిశ‌గా తీసుకెళ్లారు. ప్ర‌జాక్షేత్రంలోకి దిగుతోన్న ఇరుపక్షాలు భ‌విష్య‌త్ లో ఏ విధంగా అస్త్రశ‌స్త్రాల‌ను విసురుకుంటారో చూడాలి.