Dusshera 2022 : నేటి నుండి ఘనంగా దస‌రా శరన్నవరాత్రోత్సవాలు!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 5 వరకు వేడుకలు కొనసాగుతాయి.

Published By: HashtagU Telugu Desk
Vja Dussera

Vja Dussera

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 5 వరకు వేడుకలు కొనసాగుతాయి. నేడు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం స‌మ‌ర్పించాలి. స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవి రూపం అలంకారానికి ప్రత్యేక విశిష్టత ఉంది. విజయవాడ కనుకదుర్గ అమ్మ‌వారి అలంకారాలే మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.

స్వర్ణ కవచాలంకృత అలంకారానికి ఓ విశిష్టత

ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ధర్మం నాలుగుపాదాల ఉండేటట్లుగా అత్యంత జనప్రియంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవి భక్తుడు. ఒక రోజు రాజ కుమారుడు నగర సందర్శనం చేస్తుండగా అతని రథచక్రాల కింద ఒక బాలుడు ప్రమాదవశాత్తూ పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఏడుస్తూ రాజును న్యాయం చేయమని వేడుకుంటారు. రాజు విచారంతో తన కుమారుడే ఈ సంఘటనకు కారణమని తెలిసి మరణశిక్ష విధిస్తాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడంతో పాటు విజయవాటికా పురిలో కొన్ని ఘడియలపాటు కనకవర్షం కురిపిస్తుంది. అప్పటినుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలుస్తూ.. దసరా మహోత్సవాలలో తొలిరోజు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరించడం జరుగుతోంది.

ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దారిద్య్రములు తొలగిపోతాయని ప్రతీతి. నక్షత్రకాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే ముక్కుపుడకను ధరించి నిండైన పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారు కనిపిస్తారు.

ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి..?

పాడ్యమి రోజు అమ్మవారికి శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అలంకారం చేసి ఎరుపురంగు చీర సమర్పించి.. ఆవు నెయ్యి, పొంగలి (పులగము)ని నైవేద్యంగా నివేదన చేయడం ద్వారా జాతకములోని కుజ దోషము పరిహారం అవుతుంది. తద్వారా వివాహము కాక భాధపడే వారికి (విశిష్టంగా స్త్రీలకు) సకాలంలో వివాహం అవుతుంది. మంచి జీవిత భాగస్వామి వస్తారు. అప్పటికే వివాహము అయ్యి వైవాహిక జీవితంలో కలతలతో, స్పర్ధలతో భాధపడే వారికి (స్త్రీ , పురుషులిద్దరికి) వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్తగా వివాహమైన‌ వారు చేయడం వలన దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగి వైవాహిక సుఖం లభిస్తుంది.

అలాగే జాతకంలో అంగారకుడు బలహీనంగా ఉండటం వలన సహజంగా అలవడే అనవసర ఆవేశం, మూర్ఖంతో కూడిన మొండితనం , తొంద‌పాటు వంటివి తగ్గుతాయి. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఆరోగ్యకరమైన పురుష సంతతి కలుగుతుంది. ఆత్మన్యూన్యత భావం ఉన్నవారికీ, అనవసర భయాందోళనలకు గురి అవుతూ ఇబ్బంది పడే వారికి ఇది చాలా ప్రసక్తమైన పరిహారంగా పనిచేస్తోంది.

  Last Updated: 26 Sep 2022, 10:58 AM IST