గంజాయి, మ‌ద్యంపై ఏపీ పోలీస్ డ్రోన్ల నిఘా

డ్రోన్ల ద్వారా గంజాయి, మ‌ద్యం త‌యారీదార్ల ఆటక‌ట్టించ‌డానికి ఏపీ పోలీస్ రంగం సిద్ధం చేశారు.

  • Written By:
  • Publish Date - October 31, 2021 / 08:00 AM IST

డ్రోన్ల ద్వారా గంజాయి, మ‌ద్యం త‌యారీదార్ల ఆటక‌ట్టించ‌డానికి ఏపీ పోలీస్ రంగం సిద్ధం చేశారు. మ‌ద్యం త‌యారీ ర‌హ‌స్య స్థావ‌రాల‌పై జియో ట్యాకింగ్ చేయ‌బోతున్నారు. ఫ‌లితంగా నిరంత‌రం సాంకేతిక నిఘా అసాంఘిక శ‌క్తుల‌పై ఉండ‌బోతుంది. ఆ విష‌యాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశ‌ల్ వెల్ల‌డించాడు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాను క‌ట్ట‌డీ చేయ‌డంలో ఏపీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం చెందింద‌ని ఇటీవ‌ల విప‌క్షాలు ఢిల్లీ స్థాయిలో గ‌ళం విప్పాయి. అందుకు స్పంధించిన సీఎం జ‌గ‌న్ మ‌త్తు ర‌హిత ఏపీ కావాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. ఆ మేర‌కు స్పందించిన పోలీసులు డ్రోన్లు, జియో ట్యాగింగ్ వంటి సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి డ్ర‌గ్స్ లేని రాష్ట్రంగా ఏపీని మార్చాల‌ని ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.
విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఇండోర్ స్టేడియంలో 2500 మందికి ఒకేసారి కౌన్సిలింగ్ ఇచ్చారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 మండలాలలోని వారిని పోలీసులు బస్సులలో తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం, పోలీసు శాఖ సంయుక్తంగా వీరికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.పోలీసులు కావాలని ఎవరి మీద కేసులు పెట్టరని ప్రతి చిన్న తప్పుకు కేసు ఉంటుందని తెలిపారు. ఒక వ్యక్తిపై కేసుల సంఖ్య పెరిగితే హిస్టరీ షీటు, రౌడీ షీట్ ఓపెన్ అవుతాయని ఎస్పీ సిద్దార్థ కౌశల్ వార్నింగ్ ఇచ్చారు. నేరాలు చేసే వారికి ప్రభుత్వ నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఆపే యోచనలో ఉన్నామని…చెప్పిన మాట వినని వారిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ద్వారా ఆరు నెలల పాటు జైలుకు పంపుతామని హెచ్చరించారు. స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేయడానికి ముందుగా ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని.. కౌన్సిలింగ్ ద్వారా మారిన వారి కుటుంబాలలో చదువుకున్న వారికి ఉద్యోగం కల్పిస్తామని ఎస్పీ చెప్పారు. మారకుండా మేము ఇలానే ఉంటాం అంటే తాట తీస్తామని చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు మరింత పెంచుతామని..నిందితులను గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తామని ఎస్పీ తెలిపారు.చాలా మంది మహిళలు, మైనర్లు కూడా గంజాయి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..కొంతమంది గుట్కా అక్రమ రవాణా,విక్రయించడం జరుగుతుందని తెలిపారు.వీరి వివరాలను నమోదు చేస్తున్నామని తీరు మార్చుకోకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గంజాయి, గుట్కా, డ్రగ్స్ కేసుల్లో ఇప్పటి వరకు 10,000 మందికి పైగా తమ ప్రాణాలను పొగొట్టుకున్నారని… దీంతో ఆ కుంటుంబాలన్నీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. మచిలీపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) షేక్ మాసుమ్ బాషా మాట్లాడుతూ…నేరాలు ఎక్కువగా జరిగే గ్రామాలపై పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, పేరుమోసిన నేరస్థులపై కేసులు నమోదు చేయాలని యోచిస్తున్నామన్నారు.

కృతివెన్ను, పెడన, మైలవరం, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, నాగాయలంక తదితర గ్రామాల్లో మద్యం అక్రమ రవాణా కేసులు ఎక్కువగా ఉన్నాయని…పోలీసులు అనేక తండాలలో దాడులు నిర్వహించారని తెలిపారు. త్వరలో మరిన్ని దాడులు జరుగుతాయని ఎస్పీ కౌశల్ వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో 2021లో 6,430 గంజాయి, గుట్కా స్మగ్లింగ్, విక్రయాలు, అక్రమ మద్యం రవాణా, ఇతర ఎక్సైజ్ కేసుల్లో 7,282 మందిని పోలీసులు అరెస్టు చేశామని తెలిపారు. సుమారు 600 చెక్ పోస్టులను ప్లాన్ చేశామని అక్రమ మద్యం రవాణాదారులు, ఫైనాన్షియర్లు, పంపిణీదారులు, పంపిణీదారులపై నిరంతరం నిఘా ఉంచామని ఎస్పీ తెలిపారు.
నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ స్పెషల్ యాక్షన్ ప్లాన్ కింద క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్), కార్డన్ అండ్ సెర్చ్, నాకాబందీ తదితర ఆపరేషన్ల ద్వారా నేరస్తులను గుర్తిస్తామని తెలిపారు. ఒకటి కంటే ఎక్కువ ఎన్డిపిఎస్, ఐడి మద్యం కేసుల్లో ప్రమేయం ఉన్న వారిపై షీట్లు బుక్ చేస్తామని డిఎస్పీ హెచ్చరించారు.