APSRTC: ఏపీలో కూడా ఆర్టీసీ బస్సు మైలేజీ తగ్గితే డ్రైవర్ల జీతం నుంచి కట్!

ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పుల భారం పెరిగింది. ఆదాయం దానికి తగ్గట్టుగా రావడంలేదు. వచ్చినా సంక్షేమ పథకాలకే మెజార్టీ మొత్తం వెళ్లిపోతుంది.

  • Written By:
  • Updated On - May 16, 2022 / 12:47 PM IST

ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పుల భారం పెరిగింది. ఆదాయం దానికి తగ్గట్టుగా రావడంలేదు. వచ్చినా సంక్షేమ పథకాలకే మెజార్టీ మొత్తం వెళ్లిపోతుంది. అందుకే ప్రభుత్వాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ఉద్యోగులనూ వదలడంలేదు. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల మైలేజీ తగ్గినా, అదనంగా డీజిల్ వినియోగించినా.. ఆ ఖర్చును భర్తీ చేయడానికి వీలుగా డ్రైవర్ల జీతం నుంచి కోత విధిస్తామన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీ కూడా అదే చేస్తోంది. అంటే మైలేజీకి పూర్తిగా డ్రైవర్లదే బాధ్యతని తేల్చి చెప్పింది.

విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న అనకాపల్లి, సింహాచలం జిల్లాల్లోని ఆర్టీసు బస్సు డిపోల్లో పనిచేసే కొందరు డ్రైవర్ల నుంచి ఇప్పటికే ఇలాంటి వివరణ కోరారు. ఎందుకంటే ఆర్టీసీ లెక్కల ప్రకారం బస్సు మైలేజీ.. లీటరు డీజిల్ కు ఆరు కిలోమీటర్లు రావాలి. కానీ ఓ డ్రైవరు 5.16 కిలోమీటర్లు మాత్రమే చూపించారు. దీనివల్ల ఆ నెల 115 లీటర్ల డీజిల్ ను అదనంగా వినియోగించాల్సి వచ్చిందని.. దానికి రూ.12,075 అదనంగా ఖర్చయిందని అధికారులు లెక్క తేల్చారు. దీనిని డ్రైవరు జీతం నుంచి ఎందుకు కోత విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చారు. ఇలా ఒకరిద్దరు డ్రైవర్లకే కాదు.. చాలామందికి నోటీసులు ఇవ్వడంతో ఉద్యోగుల౦తా ఆందోళనకు గురవుతున్నారు.

ఆర్టీసీలో కొన్ని బస్సులకు కాలం చెల్లింది. ఇక ఏపీలో రహదారులు దారుణంగా ఉన్నాయి. చాలా మార్గాల్లో రోడ్లకన్నా గుంతలే ఎక్కువగా కనిపిస్తాయి. అలాంటప్పుడు మైలేజీ ఎలా వస్తుందని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక మైలేజీ రావాలంటే.. చాలా అంశాలు లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బస్ కండిషన్ కరెక్ట్ గా ఉండాలి. కెపాసిటీకి మించి ప్రయాణికులు ఉండకూడదు. ట్రాఫిక్ సిగ్నల్ ఎక్కువగా పడకూడదు. కానీ ఏపీలో ఇవన్నీ కుదరవు.

బస్సు సరైన మైలేజీ ఇవ్వకపోతే.. దానిని సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ కు పంపిస్తారు. మైలేజీ తగ్గడానికి గల కారణాలను కనుక్కోమంటారు. ఒకవేళ ఆ బస్సుకు ఏ సమస్యా లేకపోతే.. డ్రైవర్ వైపే ప్రాబ్లమ్ ఉంటే జోనల్ కాలేజీకి పంపించి.. వారం రోజుల పాటు మళ్లీ ట్రైనింగ్ ఇస్తారు. ఇవన్నీ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో ఇవేమీ జరగడం లేదు. డైరెక్ట్ గా నోటీసులు ఇవ్వడం, జీతం నుంచి రికవరీ చేస్తామనడ౦ ఏంటని ఆర్టీసీ ఉద్యోగసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.