Site icon HashtagU Telugu

Drama Fashion : ఉద్యోగం వృత్తి.. నాటకం వారికొక ఫ్యాషన్

brahmamgari naatakam

brahmamgari naatakam

Drama Fashion : ఉరుకుల పరుగుల జీవితంలో వినోదం కావాలంటే వారాంతం వరకూ ఎదురుచూడాలి. ఈ జనరేషన్ కు తగ్గట్లే థియేటర్లు, ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇంటి ముంగిట్లోకే వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు ఎంతో ప్రజాదరణ పొందిన నాటకరంగం కాస్త వెనుకబడిందనే చెప్పాలి. అప్పట్లో నాటకాలంటే చాలు.. ఊరు ఊరంతా ఒక చోట చేరి ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఇప్పుడు నాటకమంటే.. ఆ ..ఎవరూ చూస్తారులే అన్నట్లు ఉన్నారు. కానీ.. సినిమాని తలదన్నేలా 70 ఏళ్లుగా ఒక నాటక ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతుందంటే నమ్ముతారా ? నమ్మి తీరాలి.

కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో రామడుగు అనే ఊరు ఉంది. శిల్పకళకు ప్రసిద్ధిపొందిన ఆ గ్రామం.. నాటక రంగానికి కూడా ఎంతో పేరుగాంచింది. బ్రహ్మంగారి జీవిత చరిత్రకు సంబంధించిన ఆ నాటకం.. 70 ఏళ్లుగా.. ప్రతిఏటా ఎంతో ఘనంగా జరుగుతుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే.. ఐదవతరం పిల్లలు కూడా ఈ నాటకాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన 10 సంవత్సరాల పిల్లల నుంచి యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ గా ప్రాక్టీస్ చేసి మరీ ఇందులో తమ పాత్రకు జీవం పోస్తున్నారు.

వారి ప్రయాణం అలా మొదలైంది..

సుమారు 70 ఏళ్ల క్రితం కట్టా లక్ష్మీనరసయ్య భాగవతార్ అనే వ్యక్తి.. రామడుగు మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద కొందరు మిత్రులతో కలిసి బ్రహ్మంగారి జీవితచరిత్ర మొదటిసారి నాటకంలా ప్రదర్శించారు. అప్పటి నుంచి ఆ నాటకానికి ఆదరణ పెరగడంతో.. రామడుగు మండల కేంద్రంలోని హై స్కూల్ గ్రౌండ్ లో నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. జాతరను తలపించేలా ఉండే ఈ నాటక ప్రదర్శనకు చుట్టుపక్కల ఊళ్ల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వస్తుంటారు. ఇంత భారీ ఎత్తున థియేటర్లు, ఓటీటీలు ఉన్న ఈ కాలంలోనూ.. ఈ నాటకాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున కుటుంబాలతో రావడం గొప్ప విశేషం.

తండ్రి లక్ష్మీనరసయ్య నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు కట్టా సత్యనారాయణ తన సోదరులైన కట్టా నరసింహాచారి, నిరంజనాచారి సహకారంతో కొనసాగించారు. 2015లో నిరంజనాచారి, 2018లో సత్యనారాయణ చనిపోగా.. ప్రస్తుతం వారి సోదరుడైన కట్టా నరసింహాచారి తోటి కళాకారుల సహాయంతో సంప్రదాయంగా వచ్చే నాటకాన్ని కాపాడుకునేందుకు కృషిచేస్తున్నారు.