దేవరగట్టు.. కొట్టరాకొట్టు.. కర్రల యుద్ధంలో పగులుతున్న తలలు!

అదొక ట్రెడిషనల్ ఫైట్.. అక్కడికొచ్చేవాళ్లు రెండు వర్గాలుగా విడిపోతారు. పెద్ద పెద్ద కర్రలను చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ యుద్ధంలో కొందరు గాయాలపాలు కావచ్చు.. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.

  • Written By:
  • Updated On - October 16, 2021 / 05:15 PM IST

అదొక ట్రెడిషనల్ ఫైట్.. అక్కడికొచ్చేవాళ్లు రెండు వర్గాలుగా విడిపోతారు. పెద్ద పెద్ద కర్రలను చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ యుద్ధంలో కొందరు గాయాలపాలు కావచ్చు.. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇదంతా చెప్తుంటే.. గ్రామీణ ఏరియాల్లో ఉండే కక్ష్యాలు, గ్రూపు తగాదాలు గుర్తొస్తున్నాయి కదా.. అయితే ఇక్కడ కొట్టుకునేది ఏ పార్టీ కార్యకర్తలో, నాయకులో కాదండీ.. నిత్యం దేవుడ్ని పూజించే భక్తులే ఈ కర్రల సమరంలో బలవుతుంటారు. ఒకటి కాదు… రెండు కాదు.. ప్రతి ఏడాది ఆ గ్రామంలో ఇదే తంతు. ఆ గ్రామం పేరే దేవరగట్టు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా దేవరగట్టు గ్రామంలో ప్రతి సంవత్సరం దసరా వేడుకలు జరుగుతుంటాయి. ఉత్సవాలు అనగానే ఎక్కడైనా రావణదహనం లాంటి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రజలు రెండు వర్గాలు విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు. అదే ఇక్కడి ప్రత్యేకత. పండుగ వేళ ఇంతా రక్తపాతం అవసరమా? అని అక్కడివాళ్లను అడిగితే ఇదొక ట్రెడిషనల్ ఫైట్ అని సమాధానమిస్తారు.

ప్రతి ఏడాదిలాగే.. ఈ సారి కూడా జనాలు కర్రలతో కొట్టుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి హోలగొండ మండలం దేవరగట్టు గ్రామంలో బన్నీ పండుగ సందర్భంగా రెండు ప్రత్యర్థి గ్రూపులుగా విడిపోయిన వందలాది గ్రామస్తులు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఘర్షణల్లో 40 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే 100 మందికిపైగా గాయపడ్డారని అక్కడివాళ్లు చెప్తున్నారు. గాయపడినవాళ్లను ఆదోని, ఆలూరులోని ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మాల మల్లేశ్వరస్వామి దేవాలయం వద్ద కొండపై సాంప్రదాయక పోరాటంలో హింస చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కర్రల యుద్ధాన్ని ఆపేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించినప్పటికీ, గ్రామస్తులు మాత్రం ఈవేమి పట్టించుకోలేదు. దేవరగట్టు పరిధిలోని కొత్తపేట, అరికెర, అరికెర తండా, సులువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరూపాపురం గ్రామస్తులు ఈ కర్రల యుద్ధంలో పాల్గొన్నారు.

పురాణాల ప్రకారం.. శివుడు భైరవ రూపాన్ని ధరించాడట. ఓ పెద్దకర్రతో మణి, మల్లాసుర అనే ఇద్దరు రాక్షసులను సంహరించాడు. విజయదశమి రోజున ఇక్కడి గ్రామస్తులు రెండు వర్గాలు విడిపోయి దేవతా విగ్రహాలను కాపాడుతారు. అందులో భాగంగా కొట్టుకుంటారట. ఈ ఉత్సవాలకు చూసేందుకు కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు.