YS Jagan : ఉద్యోగుల కౌగిలిలో ‘స‌జ్జ‌ల‌’.. జ‌గ‌న్ స‌ర్కార్ ఆర్థిక ప‌త‌నం!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి. నాలుగు ద‌శాబ్దాల పాటు జ‌ర్న‌లిజంలో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది.

Published By: HashtagU Telugu Desk
Sajjala Jagan

Sajjala Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి. నాలుగు ద‌శాబ్దాల పాటు జ‌ర్న‌లిజంలో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. ఇటీవ‌ల వ్యాపార‌వేత్త‌గా బాగా రాణించాడు. ఇప్పుడు రాజ‌కీయ‌వేత్త‌గా వేగంగా ప‌రుగుపెడుతున్నాడు. మంత్రులు ఎంత మంది ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌నే అన్ని విభాగాల అంశాల‌ను మీడియా ముందు విశ‌దీకరిస్తున్నాడు. తాజాగా ఉద్యోగ సంఘ నేత‌ల అల్టిమేటమ్ విష‌యంలోనూ స‌జ్జ‌ల స్పందించాడు. పీఆర్సీ ప్ర‌క‌టించ‌డానికి సిద్ధంగా జ‌గ‌న్ ఉన్నాడ‌ని మీడియాకు చెప్పాడు.పే రివిజ‌న్ ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? అనేది సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా స‌జ్జ‌ల‌కు బాగా తెలుసు. లోటు బ‌డ్జెట్ ఎంత‌? రెవెన్యూ రాబడి ఎలా ఉంది? సామాజిక‌, ఆర్థిక ప‌రిస్థితులు ఏమిటి? పీఆర్సీకి కొల‌మానాలు ఎలా ఉండాలి? ఇవ‌న్నీ ఆయ‌న‌కు తెలియ‌ని అంశాలు కావు. ఎన్నో బ‌డ్జెట్ ల మీద ఆర్డిక‌ల్స్ రాసిన అనుభ‌వం ఆయ‌న సొంతం. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగుల ఒత్త‌డికి త‌లొగ్గి పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌ని చెప్ప‌డం, స్వార్థ రాజ‌కీయాల కోసం స‌ల‌హాల‌ను ఇచ్చే స‌ల‌హాదాడుగా ఆయ‌న మీద అప‌వాదు రాక‌మాన‌దు.

తాజాగా విడుద‌లైన ఆర్థిక సూచిక‌ను గ‌మ‌నిస్తే..పేద‌, ధ‌నిక వ‌ర్గాల మ‌ధ్య అంత‌రం పెరిగిపోతోంద‌ని స్పష్టం అవుతోంది. రెండు రోజుల‌ క్రితం విడుద‌ల చేసిన ఆ నివేదిక ప్ర‌కారం 22శాతం సంప‌ద కేవలం ఒక శాతం మంది వ‌ద్ద పోగ‌వుతోంది. మ‌రో వైపు సోమాలియా స‌ర‌స‌న భార‌త్ ఆక‌లి సూచిక ర్యాంకు ఉంది.ఇలాంటి దౌర్భాగ్య ప‌రిస్థితికి కార‌ణం ఇంత‌కాలంగా న‌డిచిన త‌ప్పుడు ఆర్థిక విధానాలు. అదే ప‌ద్ధ‌తిన‌ ఉద్యోగుల‌కు జీతాలు పెంచితే, ఆ భారం ప్ర‌జ‌ల మీద ప‌డుతుంద‌నే విష‌యం స‌జ్జ‌లకు తెలియ‌ని అంశం కాదు.మాన‌వాభివృద్ధి సూచిక ను గ‌మనిస్తే, ఏపీ అట్ట‌డుగు నుంచి మూడు స్థానంలో ఉంద‌ని తెలుస్తోంది. కేవలం జీడీపీపీని లెక్కిస్తూ…పేద ప్ర‌జ‌ల శ్ర‌మ‌ను ఇంత కాలం దోచుకున్నారు. ఇప్ప‌డైన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాన‌వాభివృద్ధి సూచిక‌ను కొల‌మానంగా చేసుకుని ఆర్థిక లెక్క‌లు వేస్తార‌ని చాలా మంది భావించారు. కానీ, సజ్జ‌ల లాంటి మూస ఆలోచ‌న ఉన్న స‌ల‌హాదారు…జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడ‌ని పార్టీలోని కొన్ని వ‌ర్గాలే చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

రెండేళ్లుగా ఇంట్లో కూర్చొబెట్టి ఉద్యోగుల‌కు జీతాల రూపంలో వేలాది కోట్లను ప్ర‌భుత్వం ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ అవినీతి రెండంకెల‌ను దాటింది. జ‌గ‌న్మోన్ రెడ్డి ప‌రిచ‌యం చేసిన 14400 ఫోన్ నెంబ‌ర్ కు వ‌చ్చిన ల‌క్ష‌లాది ఫిర్యాదుల‌ను చూస్తే ఉద్యోగుల దొంగ‌చాటు వ్య‌వ‌హారం ఆర్థం అవుతోంది. ప్ర‌భుత్వాల‌ను ఆర్థిక ప‌త‌నం దిశ‌గా న‌డిపించిన‌ ఉద్యోగుల‌ను సీఎం స‌ల‌హాదారుగా స‌జ్జ‌ల వెన‌కేసుకు రావ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.
ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని నిర్మిస్తాన‌ని ప్ర‌మాణం చేసిన జ‌గ‌న్ హ్యూమ‌న్ ఇండెక్స్ ను బేస్ చేసుకుని పీఆర్సీని నిర్థారించాల‌ని ఆర్థిక వేత్త‌లు కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో జీతాల‌ను త‌గ్గించే వెసుల‌బాటు పీఆర్సీలో ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం సైతం పే ఫ‌ర్ వ‌ర్క్ ప‌ద్ద‌తిని తీసుకు రావ‌డానికి సిద్ధం అవుతోంది. అందుకు సంబంధించిన అధ్య‌య‌నం కూడా జ‌రిగింది. స‌మ‌యం కోసం మోడీ స‌ర్కార్ ఎదురుచూస్తోంది. ప‌నికి త‌గిన వేత‌నం ఇవ్వాల‌ని చాలా కాలంగా కేంద్రం యోచిస్తోంద‌న్న విష‌యం జ‌గ‌న్ స‌ర్కార్ గుర్తించుకోవాలి. ఇలాంటి విలువైన స‌ల‌హాల‌ను సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గా సజ్జ‌ల ఇవ్వాలి. అలా కాకుండా మూస ధోర‌ణిలో స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి స‌ల‌హాలు ఇస్తే..జ‌గ‌న్ స‌ర్కార్ అభాసుపాలు కావ‌డం త‌థ్యం.

  Last Updated: 09 Dec 2021, 12:10 PM IST