Aqua Farmers : ట్రంప్ దెబ్బకు అల్లాడిపోతున్న ఆక్వా రైతులు

Aqua Farmers : రొయ్యల ఎగుమతులపై సుమారు రూ. 25,000 కోట్ల నష్టం వాటిల్లిందని, దాదాపు 50 శాతం ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయని ప్రభుత్వం తెలిపింది. అదనంగా సుమారు 2,000 కంటైనర్ల రొయ్యల ఎగుమతిపై సుమారు రూ. 600 కోట్ల మేర సుంకం భారం పడిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు

Published By: HashtagU Telugu Desk
Donald Trump Tariff Effect

Donald Trump Tariff Effect

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌(Donald Trump Tariffs)ల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు (Aqua Farmers) తీవ్ర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. రొయ్యల ఎగుమతులపై సుమారు రూ. 25,000 కోట్ల నష్టం వాటిల్లిందని, దాదాపు 50 శాతం ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయని ప్రభుత్వం తెలిపింది. అదనంగా సుమారు 2,000 కంటైనర్ల రొయ్యల ఎగుమతిపై సుమారు రూ. 600 కోట్ల మేర సుంకం భారం పడిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ సుంకాలు 59.72 శాతానికి చేరాయని, ఇందులో గతంలో విధించిన 25 శాతం టారిఫ్‌తో పాటు అదనంగా మరో 25 శాతం, 5.76 శాతం కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ, 3.96 శాతం యాంటీ-డంపింగ్ డ్యూటీ ఉన్నాయని పేర్కొన్నారు.

Hazaribagh Encounter : మరో ఎన్ కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌లకు ఆయన లేఖలు రాశారు. జీఎస్టీలో ఉపశమనం, ఆర్థిక ప్యాకేజీల మంజూరు, ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, దేశీయ వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, ఎగుమతిదారులకు బ్యాంకు రుణాలు, 240 రోజుల మారటోరియం, వడ్డీ రాయితీలు, గడ్డకట్టిన రొయ్యలపై 5 శాతం జీఎస్టీని తాత్కాలికంగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆక్వా రైతులకు ఎదురవుతున్న కష్టాలను ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ఉపశమన చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఫీడ్ ఉత్పత్తిదారులతో చర్చించి ఆక్వా ఫీడ్ ఎంఆర్‌పిలను కిలోకు రూ. 9 తగ్గించామని, ట్రాన్స్‌ఫార్మర్లను రాయితీపై సరఫరా చేయాలని కూడా ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. అమెరికాపై ఆధారపడకుండా ఎగుమతి మార్కెట్లను విస్తరించాలని, యూరోపియన్ యూనియన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు) చేసుకోవాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

  Last Updated: 15 Sep 2025, 01:42 PM IST