ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన అడుగులు వేస్తున్నారు. డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ లక్ష్య సాధనకు ఎదురయ్యే సవాళ్లను ప్రణాళికాబద్ధంగా అధిగమించాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులపై పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా “అడవితల్లి బాట” ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. రోడ్ల నిర్మాణం వల్ల గిరిజనులకు వైద్యం, విద్య, రవాణా వంటి అవసరాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
AP News : “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా?”.. టీడీపీ వినూత్న ప్రచారం..
అలాగే ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల కోసమేనని, ఈ అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చడానికి డోలీల అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మొత్తం ప్రక్రియలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మారుమూల గిరిజన గ్రామాలకూ రోడ్డు సౌకర్యం కల్పించి, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే ప్రభుత్వ ఆశయమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ చర్యలు గిరిజన ప్రాంతాల్లో నూతన శకానికి నాంది పలుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.