Site icon HashtagU Telugu

New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

New Smart Ration Card

New Smart Ration Card

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేశారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సచివాలయాల్లోనే కొత్త కార్డుల జారీ, పిల్లల పేర్లు చేర్చడం, చిరునామా మార్పు వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా పెళ్లైన వారికి ఆధార్, పెళ్లి ధ్రువపత్రంతో సులభంగా రేషన్ కార్డు పొందవచ్చు. ఈ ప్రక్రియలన్నీ ఇప్పుడు ఇంటి దగ్గరే పూర్తవుతాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. గతంలో కొత్త రేషన్ కార్డుల కోసం, పిల్లల పేర్లు చేర్చడం కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై అవసరం ఇకపై ఉండదు.. ఈ ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం సచివాలయాల్లో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఇకపై, ఎవరైనా, ఎప్పుడైనా తమకు కావాల్సిన రేషన్ కార్డు సేవలను పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం సచివాలయాల్లో ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థలో భాగంగా, డిజిటల్ సహాయకులకు దరఖాస్తులను స్వీకరించే బాధ్యతను అప్పగించారు. దీనివల్ల ప్రజలు తమ ఇంటి దగ్గరలోనే ఈ సేవలను పొందగలుగుతారు.

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా ప్రభుత్వం సులభతరం చేసింది. జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జులై నెలలో కొత్త కార్డులు అందజేస్తారు. అదేవిధంగా, జులై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు అందిస్తారు. ఈ విధానం వల్ల ప్రజలకు సకాలంలో కార్డులు అందుతాయి. కొత్తగా పెళ్లైన దంపతులకు రేషన్‌కార్డు ప్రక్రియ సులభతరం అయింది. గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ, ఇప్పుడు కేవలం ఆధార్ కార్డులు, పెళ్లి ధ్రువపత్రంతో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మ్యారేజ్‌ స్ప్లిట్‌ ఆప్షన్‌ ద్వారా కొత్త రేషన్‌కార్డు పొందవచ్చు. ఈ ప్రక్రియలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్తవారింట్లోనే రేషన్‌ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

గతంలో కొత్తగా పెళ్లైన దంపతులు రేషన్‌కార్డు పొందాలంటే ముందుగా మహిళను తల్లిదండ్రుల జాబితా నుంచి తొలగించేవారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు వారికి రేషన్‌ అందేది కాదు. కానీ ఇప్పుడు ఈ సమస్య లేదు. భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు, భర్త పాత రేషన్‌కార్డు, పెళ్లి ధ్రువపత్రం తీసుకుని వెళ్తే చాలు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ‘మ్యారేజ్‌ స్ప్లిట్‌ ఆప్షన్‌’లో వారి వివరాలు నమోదు చేస్తారు. వారికి ఒక నంబరు కేటాయించి, దాని ఆధారంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత వీఆర్వో , తహసీల్దారు పరిశీలనకు పంపుతారు. వారి అనుమతి లభించగానే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తారు. ఈలోగా వారికి అత్తవారింట్లోనే రేషన్‌ అందజేస్తారు.

మరోవైపు రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చడానికి, చిరునామాలు మార్చుకోవడానికి కొత్త నిబంధనలు వచ్చాయి. దీనికోసం పిల్లల ఆధార్ కార్డులు, జనన ధ్రువపత్రాలు, తల్లిదండ్రుల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ వివరాలను నమోదు చేశాక, వీఆర్వో, తహసీల్దారు పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడు పిల్లల పేర్లు కార్డులో చేరుతాయి. ఇతర వివరాల కోసం గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాలని అధికారులు తెలిపారు. కార్డుల్లో అడ్రస్ మార్చుకోవడానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Exit mobile version