Site icon HashtagU Telugu

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణ చార్జీ ఎంతో తెలుసా..?

Vande Bharat Express

Vande Bharat Exp

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైలు నేడు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తాజాగా వందే భారత్ రైలులో ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణ ఛార్జీలు వెల్లడయ్యాయి. విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక్కరికి రూ. 1,720 (ఛైర్ కార్), రూ. 3,170 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కు ఛార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక్కరికి రూ. 905 (ఛైర్ కార్), రూ. 1775 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) ఇక సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి రూ. 1365 (ఛైర్ కార్), రూ. 2485 (ఎగ్జిక్యూటివ్ క్లాస్) (క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి) టికెట్ ధరలను నిర్ణయించారు.

ఈ ఛార్జీలను ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. తొలుత ఈ నెల 19న ప్రారంభం కావాల్సిన ఈ రైలును సంక్రాంతి పండగ కానుకగా నాలుగు రోజులుగా ముందుగానే అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఈ రైలు నంబర్, ఆగే స్టేషన్లు, కాలపట్టిక వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం ఉదయం 10. 30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. కేవలం 15వ తేదీ మాత్రమే ఈ స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 8. 45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.

Also Read: Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2422 జాబ్స్

16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది.  విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు (20833) ప్రతి రోజూ ఉదయం 5. 45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2. 15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే రైలు. రాత్రి 11. 30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇందులో మొత్తం 14 ఏసీ ఛైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ రైలును తీర్చిదిద్దారు.