Site icon HashtagU Telugu

Divya Vani : దివ్యంగా ‘మ‌తం’ కార్డ్

Tdp Divyavani

Tdp Divyavani

రాజ‌కీయాల్లో సినిమా వాళ్లు ఇమడ‌డం చాలా అరుదు. ఆ రెండు రంగాలు ఒక‌ప్పుడు వేర్వేరుగా ఉండేవి. ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జ‌య‌ల‌లిత, క‌రుణానిధి లాంటి వాళ్లు మాత్ర‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్ల జాబితాలో క‌నిపిస్తారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఫెయిల్ అయిన సినీ తార‌ల జాబితా చాంతాడంత ఉంటుంది. ప్ర‌ధానంగా చెప్పుకుంటే మెగాస్టార్ చిరంజీవి, జీవితా రాజ‌శేఖ‌ర్‌, కోట శ్రీనివాస‌రావు, స‌త్య‌నారాయ‌ణ‌, జ‌య‌సుధ‌, శార‌ద‌, వాణి విశ్వ‌నాథ్, క‌విత‌..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజ‌కీయాల్లో ఇమ‌డ‌లేక దూరంగా ఉన్నారు. తాజాగా టీడీపీకి రాజీనామా చేసిన దివ్వ‌వాణి కూడా ఫెయిల్ అయిన సినీ న‌టుల జాబితాలో చేరారు.

సాధార‌ణంగా సినిమా న‌టులు చాలా మందికి `అహంబ్ర‌హ్మ‌స్మి` అనే ధోర‌ణి ఉంటుంది. అంటే, నేను త‌ప్ప మ‌రొక‌రు గొప్ప‌కాదు, తానే అన్నీ అనే భావ‌న ఉంటుంద‌ట‌. అలాంటి భావ‌న లేక‌పోతే సినిమాల్లో రాణించ‌డం క‌ష్ట‌మ‌ని ఆ ప‌రిశ్ర‌మ గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట‌. `అంద‌రికి కంటే తానే అందంగా ఉన్నాను. బాగా మాట్లాడ‌తాను. సూప‌ర్ గా న‌టిస్తాను. హావ‌భావాల‌ను ప్ర‌తి క్యార‌క్ట‌ర్లోనూ పండిస్తాను..` ఇలాంటి భావం పుష్క‌లంగా ఉంటేనే రాణిస్తార‌ని చెబుతుంటారు. అంతేకాదు, డైరెక్ట‌ర్ చెప్పిన‌దాన్ని ప‌క్కాగా తెర‌మీద పండించే నైపుణ్యం న‌టులకు ఉండాలి. అందుకే, సినీ రంగంలోకి అడుగుపెట్ట‌గానే ఒక మైండ్ సెట్ ఫిక్స్ అవుతుంది. అంతేకాదు, పొగ‌డ్త‌ల‌ను ఆశ్వాదించే నైజం బాగా అలవాటు ప‌డుతుంది. అందుకే, ఏ సినిమా ఫంక్ష‌న్ తీసుకున్నా, ప‌ర‌స్ప‌రం ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుకోవ‌డం చూస్తుంటాం. అదే, రాజ‌కీయ రంగం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, అప‌వాదులు వేసుకుంటారు. స‌రిగ్గా ఇక్క‌డే చాలా మంది సినిమా వాళ్లు రాజ‌కీయాల్లో రాణించ‌లేక త‌డ‌బ‌డుతుంటార‌ని టాలీవుడ్ భావిస్తోంది.

మిగిలిన రంగాల కంటే రాజ‌కీయాల్లో లేడీస్ రాణించ‌డం చాలా క‌ష్టం. అన్ని రంగాల్లో ఉన్న‌ట్టే కాస్టింగ్ కౌచ్ మ‌రింత ఎక్కువ ఉంటుంది. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల హ్యాష్ ట్యాగ్ యూకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రేణుకాచౌద‌రి లాంటి సీనియ‌ర్ బ‌హిర్గతం చేసిన విష‌యం విదిత‌మే. రాజ‌కీయ రంగంలో రాణించాలంటే సుదీర్ఘ కాలం ప‌నిచేయాలి. ఆటుపోటుల‌ను త‌ట్టుకోవాలి. సినిమాల్లో మాదిరిగా హిట్ ఫ‌ట్ వెంట‌నే తేల‌దు. ఇలాంటి విష‌యాల‌న్నీ తెలుసుకోకుండా బ‌హుశా దివ్వ‌వాణి టీడీపీలో చేరి ఉంటారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆమె ద‌గ్గ‌ర‌య్యారు. ఆనాడు రోజా త‌ర‌హా ఫైర్ బ్రాండ్ కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. ఆ స‌మ‌యంలో వాణి విశ్వ‌నాథ్ ను కొన్ని రోజులు ప్ర‌యోగించింది. ఆ త‌రువాత దివ్య‌వాణి ఎంట్రీ ఇచ్చారు. ఇద్ద‌రూ రాసిచ్చిన స్క్రిప్ట్ ను చ‌దివే హీరోయిన్లే. సాధార‌ణంగా తెలుగుదేశం పార్టీ లైబ్ర‌రీ నుంచి ప‌లు అంశాల‌ను రాత‌పూర్వ‌కంగా మీడియా ముందుకు వెళ్లేట‌ప్పుడు అందిస్తారు. దాన్ని ఎలివేట్ చేయ‌డంలో వాణి విశ్వనాథ్ కంటే దివ్య‌వాణి కాస్త మెరుగు. అందుకే, ఆమెను బాగా ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

సాధార‌ణంగా అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక విధంగానూ, కోల్పోయినప్పుడు మ‌రో విధంగానూ ఏ పార్టీ అయిన పంథాను మార్చుకోవ‌డం స‌హ‌జం. అలాగే, టీడీపీ కూడా ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చిన త‌రువాత క్షేత్ర‌స్థాయిలో పోరాటం చేసే వాళ్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చింది. ఆ క్ర‌మంలో ఏడాది కాలంగా దివ్వ‌వాణి ప్రాధాన్యం త‌గ్గిపోయింది. అంతేకాదు, ప‌లు ర‌కాల సామాజిక కోణాల‌ను కూడా చూడాల్సిన ప‌రిస్థితి ఏ పార్టీకైనా స‌మ‌కాలిని పరిస్థితుల‌ ఆధారంగా వ‌స్తుంది. టీడీపీ మార్చుకున్న పంథాకు దివ్య‌వాణి సెట్ కాలేద‌ని టాక్‌. అందుకే, ఆమెకు కొంత ఎలివేష‌న్ త‌గ్గించార‌ని తెలుస్తోంది. దీంతో ఆమె `అహం` దెబ్బ తిని ఉండొచ్చు. పైగా సినీ హీరోయిన్ కావ‌డంతో ఫ్ర‌స్ట్రేష‌న్ లోకి వెళ్లిపోయారు. రాజీనామా చేసి వెళ్లిపోయారు. పార్టీ కూడా చాలా లైట్ గా తీసుకుంది. కార‌ణం క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భావం చూపే లీడ‌ర్ల కోసం ఆ పార్టీ ప్ర‌స్తుతం అన్వేష‌ణ చేస్తోంది.

ఏతావాతా దివ్య‌వాణి ఎపిసోడ్ కొత్త‌గా ఏమీ లేదని చెప్పొచ్చు. గ‌తంలో వాణి విశ్వ‌నాథ్‌, జ‌య‌సుధ‌, శార‌ద‌, జ‌య‌ప్ర‌ద‌, రోజా , క‌విత‌, యామిని త‌దిత‌రులు వెళ్లిపోయిన‌ట్టు దివ్య‌వాణి వెళ్లిపోయారు. అంద‌రిలాగే పార్టీ మీద ఆమె దుమ్మెత్తి పోశారు. అధికార ప్ర‌తినిధులంద‌రికీ నేరుగా టీడీపీ చీఫ్ ను క‌లుసుకునే అవ‌కాశం ఎప్పుడూ ఉండ‌దు. అలాగే, పార్టీలో అసంతృప్తితో ఉన్న వాళ్లంద‌రితో ముఖాముఖి ఏ పార్టీలోనూ అధినేత క‌లుసుకోవ‌డం కుద‌ర‌దు. ఎంతో మంది దివ్య‌వాణి కంటే ముందు నుంచి పార్టీ కోసం ప‌నిచేస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ద‌శాబ్దాలుగా త్యాగం చేస్తూ ఎంతో మంది తెలుగు మ‌హిళ‌లు పార్టీ క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్నారు. వాళ్లంద‌రి కంటే తాను ఎక్కువ అనుకోవ‌డమే దివ్య‌వాణి మైండ్ సెట్ లోని లోపం. సినిమాల్లో మాదిరిగా రాజ‌కీయాల్లో ఆలోచిస్తే కుదర‌దు. అందుకే, గ‌తంలో రాజ‌కీయాల‌కు దూరంగా వెళ్లిన అనేక మంది సినీ న‌టుల్లో జాబితాలో దివ్వ‌వాణి కూడా ఒక‌రుగా మిగిలారు. ఆమె చెప్పిన గంట మీడియా స‌మావేశంలో ఎక్క‌డా పార్టీ చేసిన తప్పు క‌నిపించ‌డంలేదు. దుష్ట‌శ‌క్తులు అంటూ కొంద‌ర్నీ పార్టీ కార్యాల‌య నిర్వాహ‌కుల మీద ఆరోప‌ణ‌లు చేశారు. పార్టీ కార్యాల‌యంలోని కొంద‌రి నిర్వాకం కార‌ణంగా దివ్య‌వాణి మాదిరిగా బాధ ప‌డే వాళ్లు లేక‌పోలేదు. ఆ విష‌యాన్ని పార్టీ అధిష్టానం స‌మీక్షించుకుంటుందా? లేదా అనేది చూడాలి. ఇక మ‌తం కార్డ్ ను వ్యూహాత్మంగా దివ్య‌వాణి సంధించారు. పైగా జ‌గ‌న్‌, కొడాలి మీద వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఎలాంటి ద్వేషం లేదంటూ రెండు రోజుల క్రితం మాట్లాడింది. ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, వైసీపీలోకి దివ్య‌వాణి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని భావించ‌డానికి అవ‌కాశం ఉంది.