YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటన ఉంటుందని కీలక ప్రకటన చేసారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే పడుకుంటా అని తెలిపారు. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం 4 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమవుతా అంటూ జగన్ తెలిపారు. సమయం పూర్తిగా కార్యకర్తలకే కేటాయిస్తాం. అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ..వారికి తోడుగా ఉంటూ వారికి దగ్గరయ్యే కార్యక్రమం చేస్తామని తెలిపారు. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జగన్ తెలిపారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నడుము కడతానని తెలిపారు. అడుగడుగునా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. కేసులు పెడుతున్నారని ఎవరు భయపడకూడదని జగన్ కోరారు. కచ్చితంగా కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. గ్రామస్ధాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఒక ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేయాలని జగన్ స్పష్టం చేశారు.
ఇకపోతే.. ఏడాది పూర్తయ్యే సరికి గ్రామంలో టీడీపీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలన్నారు. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? మాకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? అన్న దగ్గర నుంచి మొదలైన ప్రశ్నల వర్షం… ఏమైంది మా స్కూల్? ఏమైంది మా హాస్పిటల్? ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి? ఏమైంది మా ఆర్బీకే అన్నవరకు ప్రశ్నలు లేవాలని సూచించారు. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలని సలహా ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయని కేరెక్టర్, క్రెడిబులిటీ మనం పడేస్తే మరలా ఏరుకోవడం కష్టం. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష అని పార్టీ నేతలకు జగన్ సూచించారు.