చిత్తూరు జిల్లాలో కలెక్టర్ సుమిత్ కుమార్ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. అనధికారికంగా సెలవు పెట్టిన 27 మందిపై చర్యలకు ఆదేశించారు. మొత్తం 437 మంది హాజరు కావడం లేదని నివేదికలు అందాయి. మెడికల్ లీవులో ఉన్నవారిని బోర్డుకు పంపాలని, మిగిలినవారు వెంటనే విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.
చిత్తూరు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాకిచ్చారు. అనధికారికంగా సెలవులో ఉన్న 27 మంది సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వీరంతా సచివాలయాల్లో విధులు నిర్వహించాల్సిన సమయంలో సెలవు తీసుకోవడం సరికాదని.. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకేసారి ఏకంగ 27మందిపై చర్యలకు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.
చిత్తూరు జిల్లాలో మొత్తం 612 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి.. 4,477 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 4,040 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు.. మిగిలిన 437 మంది హాజరు కావడం లేదని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎంపీడీవోలు, కమిషనర్లు కలెక్టర్‌కు నివేదించారు. అయితే ఈ 437 మందిలో 152 మంది మెడికల్ లీవులో ఉన్నారు. మిగిలిన 251 మంది ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. మెడికల్ లీవులో ఉన్న 152 మందిని మెడికల్ బోర్డుకు పంపి.. వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోలు, కమిషనర్లకు సూచించారు.
అంతేకాదు సెలవులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సచివాలయాల్లో సిబ్బంది కొరత వల్ల పనులు ఆలస్యం కాకుండా చూడాలని అధికారులను కోరారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలి అన్నారు. 27మంది సచివాలయాల సిబ్బందిపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా పలువురు సచివాలయాల సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. విధులకు ఆలస్యంగా హాజరవుతున్నవారు.. ఎవరికీ చెప్పకుండా విధలుకు డుమ్మా కొట్టినవారిపై చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి సిబ్బందిపై చర్యకు సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది.
