YCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి జ్వాల‌

`సంక్షోమ ప‌థ‌కాలు జ‌గ‌న్‌కు పేరుతెచ్చాయి, నాలుగు రోడ్ల‌ను కూడా వేయ‌లేని తాము ఎమ్మెల్యేలుగా చేత‌గాని వాళ్ల‌లా మిగిలిపోయాం.

  • Written By:
  • Updated On - June 30, 2022 / 02:11 PM IST

`సంక్షోమ ప‌థ‌కాలు జ‌గ‌న్‌కు పేరుతెచ్చాయి, నాలుగు రోడ్ల‌ను కూడా వేయ‌లేని తాము ఎమ్మెల్యేలుగా చేత‌గాని వాళ్ల‌లా మిగిలిపోయాం.` ఇదీ వైసీపీ ఎమ్మెల్యేల్లోని ఆందోళ‌న‌. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఎమ్మెల్యేలు అత్య‌ధికులు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీశారు. ఆ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల మీద దురుసుగా ప్ర‌వ‌ర్తిస్త‌న్న ఎమ్మెల్యేలు కొంద‌రైతే, మ‌రికొంద‌రు అస‌భ్య ప‌ద‌జాలాన్ని వాడుతూ పోలీసుల్ని ప్ర‌యోగిస్తున్నారు.

ఎమ్మెల్మేల గ్రాఫ్ ప‌డిపోయింద‌ని ఇటీవ‌ల జ‌రిగిన రాజ‌కీయ స‌మీక్ష‌లో జ‌గ‌న్ హెచ్చ‌రించారు. ప్ర‌జాద‌ర‌ణ లేని వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వ‌న‌ని తేల్చేశాడు. సీఎంగా త‌న గ్రాఫ్ బాగుంద‌ని ఎమ్మెల్యేల మీదే అసంతృప్తి ఉంద‌ని ఆ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు. ఇంచుమించు 100 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేల‌కు టిక్కెట్ల ఇవ్వ‌కుండా కొత్త ఫేస్ ల‌ను ఈసారి రంగంలోకి దింపాల‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. అందుకే, ఎమ్మెల్యేలు సీఎం జ‌గ‌న్ మీద కొంద‌రు రివ‌ర్స్ అవుతున్నారు. ఇలాంటి అసంతృప్తి ఏడాది క్రిత‌మే అక్క‌డ‌క్క‌డా వినిపించింది. మంచినీళ్లను కూడా అందివ్వ‌లేని దుస్థితిలో ఉన్నామ‌ని నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి అప్ప‌ట్లో వ్యాఖ్యానించారు. ఒక త‌ట్టమ‌ట్టి వేసి రోడ్లలోని గోతుల‌ను పూడ్చ‌లేని ప‌రిస్థితిలో ఉన్నామ‌ని ప్ర‌కాశం జిల్లా ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర‌రెడ్డి అస‌హ‌నం వ్య‌క్తప‌రిచారు. అదే త‌ర‌హాలో గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మేరుగ నాగార్జున రెడ్డి అమ‌రావ‌తి రాజ‌ధానిపై జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై ఒకానొక స‌మ‌యంలో అసంత‌ప్తి వ్య‌క్త‌ప‌రిచారు. అంతేకాదు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ లాంటి సీనియ‌ర్లు జ‌గ‌న్ స‌ర్కార్ పై అస‌హ‌నంగా మాట్లాడుకుంటోన్న వీడియో అప్ప‌ట్లో వైర‌ల్ అయింది.

ఏడాది క్రితం సుమారు 15 మంది ఎమ్మెల్యేలు బాహాటంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న‌పై అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. కానీ, 151 మంది ఎమ్మెల్యేల‌తో బ‌లంగా ఉన్న ప్ర‌భుత్వాన్ని ఏమీ చేయ‌లేక మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు గ‌డ‌ప‌గ‌డ‌ప కు వైసీపీ, మంత్రుల సామాజిక స‌మ‌ర‌భేరి సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను చూసిన త‌రువాత జ‌గ‌న్ పై రివ‌ర్స్ అవుతోన్న ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కోర‌స్ క‌లిపారు. ఉత్త‌రాంధ్ర ఎమ్మెల్యేల‌కు ఎక్కువ‌గా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని నియెజ‌క‌వ‌ర్గాల్లో మిన‌హా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. గోతుల మ‌యంగా మారిన రోడ్లు, విద్యుత్ కోత‌లు, ఉపాథి అవ‌కాశాలు లేక‌పోవ‌డం, పంట న‌ష్ట ప‌రిహారం అంద‌క‌పోవ‌డం త‌దిత‌ర అంశాల‌పై ఎమ్మెల్యేల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. వాటికి స‌మాధానం ఇవ్వ‌లేని ఎమ్మెల్యేలు జ‌గ‌న్ వాల‌కంపై గుర్రుగా ఉన్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గం కూర్పుపై మ‌రికొంద‌రు అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ జగన్ కు బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అప్ప‌ట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి కూడా తీవ్రమైన అసంతృప్తిని వెలుబుచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ప‌క్కా గృహాల నిర్మాణం గురించి ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌శ్నించారు. కొత్త మంత్రుల జాబితా నుంచి పార్థసారథి పేరును చివరి నిమిషంలో తొల‌గించ‌డంపై ఇప్ప‌టికీ అసంతృప్తి గా ఉన్నారు.

శిల్పా చక్రపాణి రెడ్డి , కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిది . చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ త‌దిత‌రులు ఇటీవ‌ల జ‌గ‌న్ పై అస‌హ‌నంగా ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య వర్గాలకు మంత్రి పదవులు ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయా కులాల నాయ‌కులు అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు ఆళ్లనాని, కొడాలి నాని కూడా అస‌హ‌నంగా ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడు మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. మాజీ మంత్రి మేకతోటి సుచరిత , ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నాబాబు రావు స‌మ‌యం కోసం చూస్తున్నారు. ఒంగోలుకు ఆనుకుని ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్లలో కలవకుండా పట్టుబట్టి మరీ ప్రకాశంలోనే ఉంచారు. ఇప్పుడు ఆ నియోజకవర్గమే వైఎస్సార్‌సీపీకి తలనొప్పిగా మారింది.

అధిష్టానం దెబ్బ కొట్టింది, నేనూ దెబ్బ కొడతా అంటూ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఒకానొక సంద‌ర్భంలో జ‌గ‌న్ కే వార్నింగ్ ఇచ్చారు. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ మీద కూడా ఎమ్మెల్యేలు అస‌హ‌నంగా ఉన్నారు. అన్నీ వాళ్లే చేసుకుంటూ వెళుతుంటే ప్ర‌జ‌లు త‌మ‌ను ఎలా గుర్తిస్తార‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ప‌నుల‌కు బిల్లులు స‌కాలంలో రాక‌పోవ‌డంతో స్థానిక క్యాడ‌ర్ ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌డానికి జంకుతోన్న ప‌లువురు ఎమ్మెల్యేలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విధానాల‌పై తిరుగుబాటును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ ప‌రిణామం ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.