ఏపీ అసెంబ్లీ (AP Assembly) సాక్షిగా ట్వంటీ ట్వంటీ టూ మ్యాచ్ ప్రారంభం అయింది. అత్యంత కీలకమైన సమయంలో గంటా రాజీనామాను ఆమోదించిన స్పీకర్ టీడీపీతో తొండి మ్యాచ్ కి తెరలేపారని తెలుస్తుంది. గత ఏడాది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ నిరసిస్తూ స్పీకర్ ఫార్మెట్ లో గంటా రాజీనామా సమర్పించిన విషయం విదితమే. కొన్ని నెలలుగా గంటా రాజీనామాను పట్టించుకోని స్పీకర్ ఈ రోజు మండలి ఎన్నికల నేపథ్యంలో రాజీనామా ఆమోదం ముందుగానే వైసీపీ ఓటమిని అంగీకరించినట్టు అయింది.
ఇప్పుడు వైసీపీ ఏడు సీట్లు గెలవాలంటే కావాల్సిన 154 ఓట్లు ఉన్నాయి. ఒక్కటి తేడా వచ్చినా ఫలితం మారిపోతుంది. అదే సమయంలో టీడీపీ కి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది.టీడీపీ ఓట్లు పోలవ్వటం పైన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. అనూహ్య ట్విస్టులు ఉంటాయంటూ రెండు క్యాంపుల నుంచి మైండ్ గేమ్ మొదలు అయింది. గ్రాడ్యుయేట్స్ ఫలితాలను అనుకూలంగా మలచుకున్న టీడీపీ ఈ ఎన్నికలోనూ గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ, నెంబర్ గేమ్ లో మాత్రం వైసీపీది పై చేయిగా కనిపిస్తోంది. అటు చంద్రబాబు ఇటు సీఎం జగన్ కు ఈ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో సాయంత్రం వచ్చే తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
టీడీపీకి సాంకేతికంగా 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో టీడీపీ బలం 19గా ఉంది. వైసీపీ నాయకత్వంతో విభేదించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి టీడీపీకి మద్దతు ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో టీడీపీకి 21 సభ్యుల మద్దతు కనిపిస్తోంది. అస్వస్థతో ఉన్న ఎమ్మెల్యే అనగాని తాజాగా టీడీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. దీంతో 21 మంది టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, గంటా రాజీనామా ఆమోదం ఇప్పుడు ట్విస్ట్ గా మారింది. ఇక ఇప్పుడు టీడీపీకి కావాల్సింది ఒక్క ఓటు బదులుగా రెండు కావాలి. ఆ ఓటు కోసం టీడీపీ నాలుగు రోజులుగా పలు ప్రయత్నాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీలో సీటు రాదనే అభిప్రాయంతో ఉన్న కొందరు మాజీ టీడీపీ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే టీడీపీ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. వైసీపీ – టీడీపీ అధినేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఏడు స్థానాల కోసం ఎనిమిది మంది బరిలో ఉన్నారు. రెండు పార్టీల్లోని రెబల్స్ కీలకంగా మారుతున్నారు. ఒక్క ఓటు మాత్రమే గెలుపు – ఓటముల మధ్య తేడా కనిపిస్తోంది. ఏడు స్థానాలు..ఎనిమిది మంది పోటీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏపీ అసెంబ్లీ (AP Assembly) ప్రాంగణంలో పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి ఏడుగురు..టీడీపీ నుంచి ఒక్కరు ఈ ఏడు స్థానాల కోసం పోటీ చేస్తున్నారు. ఏడుగురు అభ్యర్దులు గెలుపొందటానికి ఒక్కో అభ్యర్దికి 22 ఓట్లు అవసరం అవుతాయి. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీ – జనసేన నుంచి గెలిచిన మొత్తం అయిదుగురు మద్దతుగా ఉన్నారు. అదే సమయంలో ఆనం – కోటంరెడ్డి పార్టీ అభ్యర్దులకు మద్దతిచ్చే అవకాశం లేదు. దీంతో..వైసీపీ బలం 154గా ఉంది. సరిగ్గా ఏడుగురు అభ్యర్దులకు కావాల్సిన మెజార్టీ ఇదే.
పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా వైసీపీ శిబిరాలు – మాక్ పోలింగ్ తో ప్రత్యేకంగా మంత్రులకు.. ఏడు టీంలుగా ఏర్పాటు చేసి ఇంఛార్జ్ ల కు అప్పగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద కోపంగా ఉన్న రెబెల్స్ ఆత్మప్రభోదానుసారం బీసీ మహిళ అయిన అనురాధకు ఓటు వేస్తారని తెలుస్తుంది. దీంతో 22 ఓట్ల చుట్టూ చక్రం తిరుగుతుంది. ఈ ఎన్నిక జగన్ , బాబు రాజకీయ చతురతకు అద్దం పట్టనుంది. అందుకే మొండి గేమ్ కు జగన్ తెరలేపుతూ గంటా రాజీనామాకు ఎర్త్ పెట్టారు. కానీ ఇలా ఎన్నికల కోడ్ ఉన్న ఉన్నప్పుడు అనర్హత చెల్లదని తెలుస్తుంది. దీనిపై న్యాయ పోరాటం దిశగా టీడీపీ ముందుకు వెళ్తుంది. ఇలాంటి ట్విస్టులు సాయంత్రం వరకు చూడొచ్చు. మొత్తానికి ట్వంటీ ట్వంటీ టూ మ్యాచ్ గా దీన్ని చూడొచ్చు.