BJP Pawan Kalyan : దేవ‌తా వ‌స్త్రంలా బీజేపీ ‘రోడ్ మ్యాప్’

జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఇవ్వ‌బోయే రోడ్ మ్యాప్ పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది.

Published By: HashtagU Telugu Desk
Babu Pawan Narayana

Babu Pawan Narayana

జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఇవ్వ‌బోయే రోడ్ మ్యాప్ పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఎవ‌రికి వారే ఆ రోడ్ మ్యాప్ ను అనుకూలంగా అన్వ‌యించుకుంటున్నారు. బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు దిశ‌గా రోడ్ మ్యాప్ ఉంటుంద‌ని చంద్ర‌బాబు టీం విశ్వ‌సిస్తోంది. ఆ మేర‌కు టీడీపీ లీడ‌ర్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. పైగా వ‌న్ సైడ్ ల‌వ్ విష‌యాన్ని చంద్ర‌బాబు చెప్పిన విష‌యం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి కోణంలోనే బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ వైసీపీకి కూడా క‌నిపిస్తోంది. అందుకే, ఆ పార్టీ లీడ‌ర్లు జ‌న‌సేన ఆవిర్భావ స‌భ ముగియ‌కుండానే మీడియా ముందుకొచ్చి బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పొత్తు మీద స్పందించారు. వామ‌ప‌క్ష లీడ‌ర్లు ప్ర‌త్యేకించి సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌కు మాత్రం బీజేపీ రోడ్ మ్యాప్ భిన్నంగా క‌నిపిస్తోంది.వైసీపీకి అనుకూలంగా ఉండే రోడ్ మ్యాప్ ప‌వ‌న్ కు బీజేపీ ఇస్తుంద‌ని అంచ‌నా వేశాడు. ప్ర‌స్తుతం వైసీపీ, బీజేపీ స‌హ‌జీనం చేస్తున్నాయ‌ని సెల‌విచ్చాడు. అంతేకాదు, ఢిల్లీలో వైసీపీ నేత‌లు భ‌ర‌త‌నాట్యం చేస్తూ ఏపీకొచ్చి శివ‌తాండ‌వం చేస్తున్నారని త‌న‌దైన శైలిలో అభివ‌ర్ణించాడు. ఇవ‌న్నీ ప‌వ‌న్ కు తెలుస‌ని ముక్తాయించాడు. అందుకే, వైసీపీకి వ్య‌తిరేకంగా రోడ్ మ్యాప్ ఇవ్వ‌ద‌ని తేల్చేశాడు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతానన్న పవన్ వ్యాఖ్యలు అమ‌లు కావ‌డం అసాధ్య‌మ‌ని విశ్లేషించాడు. అంతేకాదు, బీజేపీ విష‌యంలో ఏపీలోని టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన నోరెత్త‌క‌పోవ‌డాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. ప్ర‌భుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం చేయనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను మాత్రం నారాయ‌ణ స్వాగ‌తించాడు. అంటే, ప‌రోక్షంగా టీడీపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్ట్‌, కాంగ్రెస్ పార్టీల కూట‌మి ఉండాల‌ని ఆయ‌న ఆలోచ‌న‌. కానీ, బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కూట‌మికి అనుకూలంగా ఉండ‌దు. వ్య‌తిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే కూట‌మి అనివార్యం. అదే, నారాయ‌ణ కూడా భావిస్తున్నాడు. ఆ మేర‌కు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఆహ్వానించాడు. సో…జ‌న‌సేనానికి బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ప‌వ‌న్ కి ఒక‌లా, చంద్ర‌బాబుకు మ‌రోలా, వైసీపీకి ఇంకోలా, నారాయ‌ణ‌కు భిన్నంగా క‌నిపిస్తోంది. సో..ఆ రోడ్ మ్యాప్ ను దేవ‌తా వ‌స్త్రం మాదిరిగా ఎవ‌రికి క‌నిపించేలా వాళ్లు అన్వ‌యించుకోవ‌డం ఏపీ రాజ‌కీయాల్లోని హైలెట్ పాయింట్‌.

  Last Updated: 17 Mar 2022, 11:48 AM IST