ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సింగపూర్ పర్యటన(Singapore Tour)లో భాగంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే కీలక ప్రకటన చేశారు. సింగపూర్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు (Flight Services) ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. సింగపూర్లో జరిగిన “తెలుగు డయాస్పోరా” కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, విదేశాల్లో నివసిస్తున్న సుమారు 50 లక్షల తెలుగు ప్రజలకు రాకపోకల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేగాక, అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Monsoon Health Tips: వర్షంలో తడిస్తే జలుబు, జ్వరమే కాదు.. ఈ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయట!
ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ సంస్థల అధిపతులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, ఎయిర్ బస్, హనీవెల్, ఎవర్వోల్ట్ సంస్థల ప్రతినిధులతోనూ సమావేశాలు జరగబోతున్నాయి. “నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు” అనే కాన్సెప్ట్‌పై బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఇందులో సింగపూర్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించనున్న ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధికి సంబంధించి అనుసంధాన వ్యూహాలు రూపుదిద్దే అవకాశముంది. తదుపరి టుయాస్ పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించి, పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిపై PSA సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నారు. రాష్ట్రంలో స్మార్ట్ లాజిస్టిక్స్, భారీ తయారీ పరిశ్రమలు, ఎగుమతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది తోడ్పడనుంది. ఇవన్నీ రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి కీలక ఘట్టాలుగా నిలవబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
సాయంత్రం 4.30 గంటలకు సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలపై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేకంగా భేటీ అయ్యే సీఎం.. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై చర్చించనున్నారు. మొత్తం మీద ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.