Ganta Srinivasa Rao : జ‌న‌సేన ‘గంటా’ మోగ‌లేదు.!

గాలి వాటం పొలిటిక‌ల్ లీడ‌ర్లు కొంద‌రు ఉంటారు. వాళ్లు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అంచ‌నా వేయ‌డం క‌ష్టం. అధికారంలోకి ఏ పార్టీ వ‌స్తే దానిలోకి వెళ్ల‌డం లేదంటే గెలిచే మూడ్ ఉన్న పార్టీలో చేర‌డం చేస్తుంటారు. అలాంటి లీడ‌ర్ల‌లో ఒక‌రుగా గంటా శ్రీనివాస‌రావు గురించి చెబుతుంటారు

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 03:12 PM IST

గాలి వాటం పొలిటిక‌ల్ లీడ‌ర్లు కొంద‌రు ఉంటారు. వాళ్లు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అంచ‌నా వేయ‌డం క‌ష్టం. అధికారంలోకి ఏ పార్టీ వ‌స్తే దానిలోకి వెళ్ల‌డం లేదంటే గెలిచే మూడ్ ఉన్న పార్టీలో చేర‌డం చేస్తుంటారు. అలాంటి లీడ‌ర్ల‌లో ఒక‌రుగా గంటా శ్రీనివాస‌రావు గురించి చెబుతుంటారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవ‌ల విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశంపై పార్టీల‌కు అతీతంగా రాజీనామాలు చేయాల‌ని పిలుపునిస్తూ టీడీపీ కి రిజైన్ చేశారు. ఆయ‌న పిలుపుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో సైలెంట్ అయ్యారు. ప్ర‌స్తుతం టీడీపీలో ఆయ‌న ఉన్న‌ప్ప‌టికీ లేన‌ట్టే అంటూ ఆ పార్టీలో చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే మూడేళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాలకు ఆయ‌న హాజ‌రు కాలేదు. పైగా మూడు రాజ‌ధానుల‌కు గంటా మ‌ద్ధ‌తు పలికారు. దీంతో టీడీపీ ఆయ‌న్ను దాదాపుగా వ‌దిలేసింది.

ఒంగోలు మ‌హానాడు త‌రువాత పార్టీకి దూరంగా ఉంటోన్న లీడ‌ర్లు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఆ జాబితాలో గంటా శ్రీనివాస‌రావు ఉన్నారు. ఒక‌ప్పుడు ఇలాంటి వాళ్ల‌ను టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ముఖాముఖి బుజ్జ‌గించే వాళ్లు. ఇప్పుడు అసంతృప్తివాదుల‌ను ఎవ‌ర్నీ వ్య‌క్తిగ‌తంగా పిలిచి మాట్లాడేందుకు బాబు ఇష్ట‌ప‌డ‌డంలేదు. పైగా గంటా శ్రీనివాస‌రావు లాంటి వాళ్ల‌ను దూరంగా పెడుతున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో లైజ‌నింగ్ నెర‌ప‌డానికి ప్ర‌య‌త్నం చేసిన గంటా ఇటీవ‌ల విఫ‌లం అయ్యారు. సూట్ కేసు కంపెనీల పేరుతో కోట్లాది రూపాయ‌లు బ్యాంకుల నుంచి తీసుకుని డిఫాల్ట‌ర్ గా గంటా ఉన్నారు. నాన్ బెయిల‌బుల్ వారెంట్లు కూడా ఆయ‌న‌పై ఇష్యూ అయ్యాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ పార్టీ కూడా ఆయ‌న్ను ద‌గ్గ‌ర‌కు తీసుకోవ‌డానికి సాహ‌సం చేయ‌డంలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కున్న ఒకేఒక ఆప్ష‌న్ జ‌న‌సేన‌. ఆ పార్టీలో చేర‌బోతున్నార‌ని గ‌త వారం రోజులుగా టాక్ న‌డుస్తోంది.

మూడేళ్ల త‌రువాత ఇటీవ‌ల విశాఖ‌లో టీడీపీ నిర్వ‌హించిన మినీ మ‌హానాడుకు గంటా శ్రీనివాస‌రావు హాజ‌ర‌య్యారు. ఆ కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు హాజ‌రు అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్యేకంగా గంటాను గ‌తంలో మాదిరిగా ప‌ట్టించుకోలేదు. లైట్ గా తీసుకున్నారు చంద్ర‌బాబు. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను గంటా అన్వేషించుకున్నారు. అంతేకాదు, చంద్ర‌బాబు పిలిచి మాట్లాడ‌తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వేచిచూశార‌ట‌. వ్య‌క్తిగ‌తంగా పిలిచి మాట్లాడితే, తెలుగుదేశంలోనే కొన‌సాగే ఆలోచ‌న ఉంద‌ని ఆయ‌న స‌న్నిహితుల నుంచి వ‌స్తోన్న స‌మాచారం. కానీ, గ‌తంలోని టీడీపీకి ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న ప‌రిస్థితుల‌కు పూర్తి భిన్నంగా ఉంది. జాతీయ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శిగా ఉన్న లోకేష్ ప్ర‌మేయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్ర‌త్య‌క్షంగా కనిపిస్తోంది. ఆయ‌న జ‌మానాలో బుజ్జ‌గింపులు అనేవి ఉండ‌వు. హార్డ్ కోర్ టీడీపీ లీడ‌ర్ల‌కు మిన‌హా పార్ట్ టైం వ్య‌వ‌హారాలు న‌డిపే వాళ్ల‌కు ఏ మాత్రం బుజ్జ‌గింపులు, ఆఫ‌ర్లు ఇప్పుడు లేకుండా చేశారు లోకేష్‌.

గ‌తంలో ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో గంటా శ్రీనివాసరావును బుజ్జ‌గించిన సంద‌ర్భాలు లేక‌పోలేదు. అంతేకాదు, ఆయ‌న‌కున్న కొన్ని స‌మ‌స్య‌ల‌ను కూడా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు ప‌రిష్క‌రించార‌ని పార్టీలోని టాక్‌. కానీ, మూడేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న గంటాను ఇప్పుడు భ‌రించే ప‌రిస్థితిలో టీడీపీ లేద‌ని తెలుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారారు. తొలుత తెలుగుదేశం పార్టీ త‌ర‌పున అన‌కాప‌ల్లి లోక్ స‌భకు 1999లో ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత చోడ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల నాటికి చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ త‌ర‌పున అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్ర‌జారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం త‌రువాత కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతూ 2014 ఎన్నిక‌ల నాటికి తిరిగి టీడీపీలోకి వ‌చ్చారు. ఆ ఎన్నిక‌ల్లో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

రాజ‌కీయ నేప‌థ్యాన్ని అడ్డుపెట్టుకుని ప‌లు బ్యాంకుల‌ను మోసం చేశారు. ఆ మేర‌కు ప‌లు కేసులు ఆయ‌న మీద ఉన్నాయి. అధికార పార్టీల‌కు కొమ్ముకాస్తూ మూడేళ్లుగా కాలం వెళ్ల‌తీశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొన‌సాగాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, ఆ పార్టీ అధిష్టానం గ‌తంలో మాదిరిగా ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంలేదు. దీంతో మ‌రో మార్గంలేక జ‌న‌సేన వైపు అడుగులు వేస్తున్నార‌ని విశాఖ‌లోని టాక్‌. కానీ, మెగా కుటుంబంలోని భేదాభిప్రాయాల న‌డుమ అక్క‌డ కూడా డోర్స్ ఓపెన్ గా లేవ‌ని తెలుస్తోంది.

చిరంజీవికి చాలా సన్నిహితంగా గంటా శ్రీనివాస‌రావు ఉంటారు. ప్ర‌స్తుతం చిరంజీవి, ప‌వ‌న్ మ‌ధ్య కొన్ని పొర‌పొచ్చాలు న‌డుస్తున్నాయ‌ని టాలీవుడ్ లో వినిపిస్తోంది. దానికి క్లారిటీ ఇవ్వ‌డానికి ఇటీవ‌ల నాగ‌బాబు కూడా ప్ర‌య‌త్నం చేశారు. జ‌నసేన‌కు మ‌ద్ధ‌తు ప‌లికే వాళ్లు మాత్ర‌మే మెగా అభిమానులంటూ ప్ర‌క‌టించారు. దీంతో మెగా హీరోల మ‌ధ్య‌ పొర‌పొచ్చాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది. ఆ క్ర‌మంలో చిరంజీవి స్నేహితుడిగా ముద్రున్న గంటా శ్రీనివాస‌రావుకు బ‌హుశా జన‌సేన‌లోనూ పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌క‌పోవ‌చ్చు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జారాజ్యం విలీనం కోసం చ‌క్రం తిప్పిన లీడ‌ర్ల‌లో గంటా ప్ర‌ముఖునిగా ఉన్నారు. దీంతో ప‌వ‌న్ కు స‌హ‌జంగా ఆయ‌న మీద గుడ్ విల్ ఎంత ఉంటుందనేది అంచ‌నా వేయొచ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో గంటా శ్రీనివాస‌రావు జ‌న‌సేన‌లోకి వెళ‌తారా? అనేది చూడాలి.