3 Capitals AP : జ‌గన్ ‘3’ ముచ్చ‌టే.! మ‌ళ్లీ ‘బిల్లు’పై అపోహ‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల బిల్లును స‌మ‌గ్రంగా మ‌రో రూపంలో తీసుకొస్తాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - December 7, 2021 / 03:36 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల బిల్లును స‌మ‌గ్రంగా మ‌రో రూపంలో తీసుకొస్తాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. కానీ, అంత ఈజీగా ఆయ‌న ఆలోచ‌న సాకారం అయ్యేలా క‌నిపించ‌డంలేదు. మాజీ సీఎం చంద్ర‌బాబు హ‌యాంలో సేక‌రించిన భూమి విలువ సుమారు 1.5 ట్రిలియ‌న్ విలువ ఉంటుంది. ఈ మొత్తం విలువ మీద 150శాతం ప‌రిహారం కింద రైతుల‌కు ఏపీ ప్ర‌భుత్వం చెల్లించాలి. అదే జ‌రిగితే, రాష్ట్ర జీఎస్డీపీలో 75శాతంపై అప్పుగా తేల‌నుంది. ఈ లెక్క‌లు చూస్తే రైతులను కాద‌ని మూడు రాజ‌ధానుల‌కు జ‌గ‌న్ వెళ్ల‌డం అసాధ్యంగా క‌నిపిస్తోంది.రాష్ట్రంలోని ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రులుగా ఉన్న కార్యాల‌యాలు అన్నీ బ్యాంకుల‌కు ఏపీ ప్ర‌భుత్వం కుదువ పెట్టింది. ఇప్పుడు ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తి భూముల‌ను వేలం వేయ‌డం మిన‌హా మ‌రో మార్గం జ‌గ‌న్ స‌ర్కార్ కు లేదు. అలా కాకుండా మూడు రాజ‌ధానుల అభివృద్ధి చేయ‌డం క‌ష్టం. చేతిలో డ‌బ్బు లేకుండా జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజ‌ధానుల ఆలోచ‌న చేయ‌డం స‌రైన విధానం కాద‌ని ఏపీ మాజీ బ్యూరోక్రాట్ అభిప్రాయం.ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న ప్ర‌కారం కార్య‌నిర్వ‌హ‌ణ రాజ‌ధాని వైజాగ్‌, శాస‌న రాజ‌ధాని అమ‌రావ‌తి, న్యాయ రాజ‌ధాని క‌ర్నూలుగా ఉండాలి. కానీ, న్యాయ రాజ‌ధాని ఎక్క‌డ ఉండాలి? అనేది అసెంబ్లీ నిర్ణ‌యించ‌డానికి అవ‌కాశం లేదు. రాజ్యాంగంలో ఆ అవ‌కాశం శాస‌న వ్య‌వ‌స్థ‌కు ఇవ్వ‌లేదు. దీంతో న్యాయ రాజ‌ధాని ఎక్క‌డ ఉండాలో..కొలిజియం, సుప్రీం కోర్టు తేల్చుతాయి. అంతేగానీ, ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం న్యాయ వ్య‌వ‌స్థ న‌డ‌వ‌దు. ఇదే అంశం జ‌గ‌న్ ఆలోచ‌న‌కు తాత్కాలిక బ్రేక్ వేసింది. న్యాయ రాజ‌ధాని కాకుండా మిగిలిన రెండు రాజధానుల‌కు సంబంధించిన బిల్లును బ‌డ్జెట్ స‌మావేశాల్లో పెట్టాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నాడ‌ట‌. ఆ లోపు న్యాయ రాజ‌ధానికి అనుసంధానంగా ఉండే కార్యాల‌యాల‌ను క‌ర్నూలు త‌ర‌లించాల‌ని ప్లాన్ చేశాడు. ఆ క్ర‌మంలోనే కొన్ని కార్యాల‌యాలు త‌ర‌లి వెళ్లి పోయాయ‌ని తెలుస్తోంది.

మాజీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మించాల‌ని త‌ల‌పోశాడు. అందుకోసం సింగపూర్ ప్ర‌భుత్వ గుర్తించిన రెండు క‌న్స‌ల్టెంట్ కంపెనీల‌కు నిర్మాణ ప‌నుల‌ను అప్ప‌గించాడు. నగరం 217 చ.కి.మీ భౌగోళిక విస్తీర్ణంలో విస్తరించి, సుమారు 8 బిలియన్ డాల‌ర్ల‌తో అభివృద్ధి చేయాల‌ని ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చించాడు. ఊహించ‌ని విధంగా 2019 ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని బాబు చ‌విచూశాడు. దాంతో అమ‌రావ‌తి ప్రాజెక్టు కూడా చ‌తికిల‌ప‌డింది.
వాస్త‌వంగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన త‌రువాత అక్క‌డి భూముల ధ‌ర‌లు వంద‌ల రెట్లు పెరిగాయి. నగరానికి గుర్తించిన దాదాపు 54 వేల ఎకరాల్లో 42 వేల ఎకరాలు సాగు భూమి. ప్రతి ఏడాది మూడు పంట‌లు పండేందుకు అవ‌స‌ర‌మైన సాగునీరు 40వేల ఎక‌రాల‌కు అందేది. అంతేకాకుండా, ఈ ప్రాంతం మొత్తం సమృద్ధిగా పత్తి ని పండించేందుకు అనువైన నేల, వ్యవసాయానికి విలువైనది. వివిధ క‌మిటీలు ఇచ్చిన నివేదిక‌ల ఆధారంగా అమ‌రావ‌తిని చంద్ర‌బాబు నిర్ణ‌యించాడు. దానికి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్‌ మ‌ద్ధ‌తు ప‌లికాడు.

అధికారం పోయిన త‌రువాత అదునుచూసి చంద్ర‌బాబు మీద రాజ‌కీయ దెబ్బ కొట్టేందుకు జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు అస్త్రాన్ని సంధించాడు. రాజ‌ధాని ప‌రిధిలో ఎక్కువ మంది క‌మ్మ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. వాళ్లు తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉంటారని జ‌గ‌న్ భావ‌న‌. కొన్ని ద‌శాబ్దాలుగా క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ఏపీలో అధికార మార్పిడి జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉంటే..చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం బ‌లోపేతం అవుతుంద‌ని జ‌గ‌న్ ఆలోచించాడు. ప్ర‌త్యామ్నాయంగా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. ఫ‌లితంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఆర్థిక మూలాల‌ను దెబ్బ తీశాడ‌ని రాజ‌కీయ వ‌ర్గాల భావ‌న‌.
మూడు రాజ‌ధానుల బిల్లును మ‌ళ్లీ పెట్టాల‌ని యోచిస్తోన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాలి. ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక దుస్థితిలో ప‌రిహారం ఇవ్వ‌డం అసాధ్యం. సో…మూడు రాజ‌ధానుల బిల్లు జ‌గ‌న్ ఆలోచ‌న‌గానే మిగిలే అవ‌కాశం లేక‌పోలేదని న్యాయ‌, ఆర్థిక నిపుణుల టాక్‌.