Site icon HashtagU Telugu

Amalapuram Fire: ఆ వాట్సప్ మెసేజ్ లే అమలాపురాన్ని అగ్నిగుండంగా మార్చాయా?

Amalapuram Fire

Amalapuram Fire

పచ్చటి కోనసీమ అగ్నిగుండంగా మారింది. ఛలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధనా సమితి ఇచ్చిన పిలుపుమేరకు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛలో అమలాపురం, జయహో కోనసీమ పేరుతో వాట్సప్ లో ఈమేరకు మెసేజ్ లు ఫార్వార్డ్ అయ్యాయి. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసు అధికారులు.. 300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అమలాపురానికి పది కిలోమీటర్ల బయటే సెక్యూరిటీని టైట్ చేశారు. ఫోన్లు చెక్ చేసి మరీ పంపించారు. గడియారం స్తంభం దగ్గరకు తొలుత పదుల సంఖ్యలోనే వచ్చినవాళ్లు..గడియారంలో ముళ్లు తిరుగుతున్న కొద్దీ.. వేల సంఖ్యలో చేరుకున్నారు.

పోలీసులు లాఠీఛార్జీ చేసినా సరే దాడులు మాత్రం ఆగలేదు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లపైనా దాడి చేశారు. ఇళ్లు తగులబెట్టినా సరే.. ఆ మంటలను ఆర్పడానికి ముందుకు రావడానికి ఫైరింజన్ సిబ్బంది కూడా వెనకడుగు వేయాల్సి వచ్చింది. నిజానికి ఈనెల 20నే కోనసీమ జిల్లా సాధనా సమితి నేతృత్వంలో వేలాదిమంది కలెక్టరేట్ కు వచ్చారు. అప్పుడే ఉద్రిక్త పరిస్థితులు ఏమైనా తలెత్తుతాయేమో అని పోలీసు అధికారులు అనుమానించారు. కానీ అలాంటి ఘటనలు ఏమీ జరగకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా.. ఈనెల 23 నుంచే పోలీసులు అమలాపురంలో ఆంక్షలు విధించారు. వారం రోజుల పాటు 144 సెక్షన్, జూన్ 30 వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్నారు. అయినా వేలాదిమంది నిరసనకారులు మళ్లీ ఒక్కచోటుకు ఎలా చేరుకోగలిగారు?

ఇంతమంది నిరసనకారులు ఒక్కచోటుకు చేరుకునే అవకాశం ఉందన్న విషయాన్ని పోలీసులు ముందుగానే ఎందుకు అంచనా వేయలేకపోయారు? నిఘావర్గాలు ఎందుకు ముందే ఈ విషయాన్ని పసిగట్టలేకపోయాయి? మంత్రి, ఎమ్మెల్యే ఇంటికే నిప్పు పెట్టేవరకు పరిస్థితి ఎలా వచ్చింది? అంతవరకు పోలీసు బలగాలను ఎందుకు అదనంగా రప్పించలేదు… ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికే కోనసీమను పోలీసులు అష్టదిగ్బంధం చేయడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

 

Exit mobile version