Site icon HashtagU Telugu

Investigation : దర్యాప్తు మొత్తం ఆ సెక్షన్ కోసమే సాగిందా?

Did The Entire Investigation Go On For That Section..

Did The Entire Investigation Go On For That Section..

By: డా. ప్రసాదమూర్తి

CID Investigation only for that Section? : కొండను తవ్వి ఎలకను పట్టినట్టు, ఏపీ సిఐడి వారు మొత్తం న్యాయ శాస్త్రాన్ని ఆపోసన పట్టి 409 సెక్షన్ కనిపెట్టారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అనేది పాత నీతి. పాలకులు తలుచుకుంటే కొరడా దెబ్బలు కాదు ఏకంగా కటకటాలే అన్నది నేటి నీతి. ఈ విషయంలో చంద్రబాబును అరెస్టు చేసి జగన్ తీర్చుకున్న రాజకీయ కక్షను తాజా ఉదాహరణగా చూపించాలి. తనను అరెస్టు చేయడానికి ప్రభుత్వం సకల సన్నాహాలూ చేస్తోందని, రేపో మాపో తన అరెస్టు తప్పదని ముందు నుంచే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలను హెచ్చరిస్తూనే ఉన్నారు. తూటాలకే భయపడలేదు ఈ సంకెళ్లు, అరెస్టులు నన్నేం చేస్తాయని ఆయన హుంకరిస్తూనే ఉన్నారు. జగన్ సర్కారుకు పరోక్షంగా ఆయన, తన జోలికి వస్తే ఖబర్దార్ అనే సంకేతాలు పంపుతూనే ఉన్నారు. కానీ అనుకున్న కార్యాన్ని జగన్ అనుకున్నట్టుగా అమలుపరచేశాడు.

అయితే చంద్రబాబు అరెస్టు జరిగిన విధానం, అనుసరించిన పద్ధతులు, సిఐడి పోలీసులు ప్రవర్తించిన తీరు, ఏసీబీ కోర్టులో సిఐడి వారు సమర్పించిన రిపోర్టు, వాదనలు అన్నీ పరిశీలిస్తే చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా అత్యంత ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు అరెస్టు తతంగాన్ని జరిపించినట్టు అర్థమవుతుంది. 2021లో ప్రారంభమైన కేసు ఇది. అప్పుడు ముద్దాయిల జాబితాలో చంద్రబాబు పేరు లేదు. ఈ మూడేళ్లలో కేసు తిరిగిన మలుపులు ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ విచారణ జరిగింది (Investigation), ఏ విషయాలు బయటకు వచ్చాయి, ఎవరెవరు ఏం చెప్పారు, ఈ కేసులో పూర్వాపరాల పూర్తి సమాచారం ఏంటి, ఎవరికి ఇందులో పూర్తి జోక్యం ఉంది, కేసులో జరిగినట్టు ఆరోపిస్తున్న విషయాలు నిజమే అయితే ప్రధాన నిందితులుగా ఎవరు ఉంటారు, ఎవరికి ఏ శిక్ష పడుతుంది, ఎవరు శిక్ష నుంచి బయటపడతారు.. ఇలాంటి విషయాలు చాలా తేలాల్సి ఉంది.

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమన్ కంపెనీతో జరిగిన ఒప్పందం అంతా గాలిలో జరిగిందని, ప్రభుత్వం నుంచి ధనం బయటికి వెళ్లడం తప్ప ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆర్థికపరమైన సహాయం ఏదీ లేదని, ఆ కంపెనీకి సంబంధించిన అనేక షెల్ కంపెనీల జోక్యం ఇందులో ఉందని, వాటికి ప్రభుత్వ నిధులు తరలించబడ్డాయని, వాటి నుంచి తిరిగి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నిధులు అందాయని.. ఇలా మొత్తం కేసుని నిర్మించారు. వీటిలో వాస్తవాలు ఎంత, ఆ వాస్తవాలు ఎంత అనేది ఇంకా తేలవలసి ఉంది. దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు తేలాల్సి ఉంది.

ఈ విషయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించినా, రేపు బాబుకు బెయిల్ వస్తే ఆయన బయటకు వస్తారు. ఇక్కడ కాకుంటే హైకోర్టు, హైకోర్టు కాకుంటే సుప్రీంకోర్టు ఎక్కడికైనా వెళ్లే న్యాయపరమైన వెసులుబాటు చంద్రబాబుకు ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు దోషిగా జైలుకి వెళ్తారా, నిర్దోషిగా బయటకు వస్తారా అనే విషయం ఎలాగూ కొద్ది రోజుల్లో తేలిపోతుంది. కానీ ఆయన అరెస్టుకు ముందు జరిగిన నేపథ్యం మాత్రం కొన్ని అనుమానాలకు తావిస్తోంది.

ఈ కేసు విషయంలో ఎంత విచారణ చేశారో ఏం దర్యాప్తు (Investigation) చేశారో తెలియదు కానీ, ఈ మూడేళ్ల కాలంలో చంద్రబాబును అరెస్టు చేయడానికి, ఆయనను కొన్ని రోజులైనా జైల్లో ఉంచడానికి ఏ విధమైన సెక్షన్లు పెట్టాలి.. ఎలా పక్కా వ్యూహాన్ని రచించాలి.. ఏ సమయంలో ఆయన అరెస్టుకు ముహూర్తం పెట్టాలి.. ఆయన అరెస్టుకు దేవుడే దిగివచ్చినా అడ్డుపడడానికి వీలు లేకుండా ఎలాంటి లీగల్ సూత్రాలను అన్వేషించాలి.. అనే వాటి మీద అద్భుతమైన కసరత్తు జరిగినట్టుగా ఈ అరెస్టు పూర్వపరాలను చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు మీద ఈ కేసులో అనేక సెక్షన్లు విధించినప్పటికీ వాటిలో అన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడడానికి, బెయిల్ రావడానికి అనువైనవే.

అయితే వాటితో సరిపెడితే కుదరదు. బాబు అసలే చాణుక్యుడు కదా. తప్పించుకునే అవకాశాలు ఆయనకు ఎందుకు ఇవ్వాలి? అందుకే ఒక సెక్షన్ ని వెతికి పట్టుకున్నారు. అదే భారత శిక్షాస్మృతిలో సెక్షన్ 409. దీని ప్రకారం స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసిన నేరం మీద పదేళ్లపాటు లేదా జీవితకాలం శిక్షను విధించవచ్చు. ఈ సెక్షన్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 41A కింద ముందస్తుగా నోటీసు జారీ చేయాల్సిన అవసరం లేదు. అలాగే గవర్నర్ అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా.. దివారాత్రాలలో ఏ క్షణమైనా ఈ సెక్షన్ కింద ఆరోపిత వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. అతని వయసు ఎంతైనా అరెస్టుకు అడ్డురాదు.

ఇలా 409 సెక్షన్ కింద కేసు బుక్ చేయడమే సిఐడి వారు ఈ కేసు విచారణలో సాధించిన గొప్ప ముందడుగు. వీరి వాదనలు కోర్టులో నిలబడతాయా లేదా, అసలు ఆ సెక్షన్ కింద చంద్రబాబు నాయుడుని దోషిగా పేర్కొనడానికి కేసులో అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తరువాత తేలుతుంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు అరెస్టుని ఎవరూ అడ్డుకోకుండా అమలు చేయాలనే వ్యూహం మాత్రమే ఈ సెక్షన్ విధించడంలో కనిపిస్తుంది. కేసులు పెట్టేవారు తమకు అనుకూలంగా సెక్షన్లు పెడతారు.

అలాగని అవి కోర్టులో నిలబడతాయని చెప్పలేం. గతంలో హేమాహేమీలైన రాజకీయ నాయకులు ఇదే సెక్షన్ కింద నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొని, కోర్టులో బెయిల్ తెచ్చుకొని హాయిగా బయటపడిన వారు చాలామంది ఉన్నారు. అందుకే చంద్రబాబు అరెస్టు కోసం ఏపీ సిఐడి వారు చేసిన కసరత్తు ఆ కేసు విచారణలో (Investigation) ఏ మాత్రం చేశారో తేలాల్సి ఉంది. అయితే అవినీతి ఆరోపణల కింద జైలుకు వెళ్లడం వేరు, బెయిల్ మీద బయటకు రావడం వేరు. ఇందులో చంద్రబాబుని అరెస్టు చేయించిన జగన్మోహన్ కి కొత్త ఏమీ కాదు.

తనలాంటి జైలు చరిత్ర చంద్రబాబుకు కూడా ఉందని రేపు ఎన్నికలలో జగన్ ప్రచారం చేసుకోవచ్చు. ఈ ఒక్క అవకాశం కోసమే జగన్ ఈ పని చేశాడా, మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయి, చంద్రబాబు అరెస్టుతో జగన్ కి రానున్న ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందా, అది బెడిసి కొట్టి చంద్రబాబుకి, ఆయన పార్టీకి సానుభూతి పవనాలు చెలరేగే అవకాశం ఉందా అనేది రానున్న కాలమే చెబుతుంది.

Also Read:  23 Sentiment For Chandrababu : మళ్లీ చర్చగా మారిన చంద్రబాబు ’23’