Mekapati Family: ‘మంత్రి ప‌ద‌వి’ ఆఫ‌ర్ నిరాక‌ర‌ణ‌?

జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో చేర‌డానికి మాజీ మంత్రి స్వ‌ర్గీయ గౌత‌మ్ రెడ్డి స‌తీమ‌ణి సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - March 26, 2022 / 03:05 PM IST

జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో చేర‌డానికి మాజీ మంత్రి స్వ‌ర్గీయ గౌత‌మ్ రెడ్డి స‌తీమ‌ణి సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మంత్రివ‌ర్గం మార్పుల‌కు సంబంధించిన క‌స‌ర‌త్తు జరుగుతోంది. ఆ క్ర‌మంలో గౌత‌మ్ రెడ్డి సతీమ‌ణికి మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌డ‌మే కాకుండా ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిల‌పాల‌ని జ‌గ‌న్ భావించాడ‌ని తెలుస్తోంది. అయితే, ఆయ‌న ఇచ్చిన ఆఫ‌ర్ ను కుటుంబం స‌మేతంగా తిర‌స్క‌రించిన‌ట్టు స‌మాచారం.
ప్ర‌స్తుతం మేక‌పాటి కుటుంబం నుంచి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఉద‌య‌గిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఎమ్మెల్యేగా గౌత‌మ్ రెడ్డి ఉంటూ అకాల మ‌ర‌ణం పొందాడు.

త్వ‌ర‌లోనే ఆ నిజయోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక‌లు రాబోతున్నాయి. అందుకే, మంత్రి ప‌ద‌విలోకి గౌత‌మ్ రెడ్డి స‌తీమ‌ణిని తీసుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ యోచించాడ‌ట‌. ఇక కుటుంబం పెద్ద‌గా మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఎలాంటి ప‌ద‌వి లేకుండా ఉన్నాడు. మాజీ ఎంపీగా సేవ‌లు అందించిన ఆయ‌న రాజ్య‌స‌భ ను ఆశిస్తున్నాడ‌ని అనుచ‌రులు చెబుతున్నారు. జ‌గ‌న్ ఇచ్చిన మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ ను తొలుత స్వాగతించిన మేక‌పాటి కుటుంబం ఆ త‌రువాత వెనుక్కు త‌గ్గింద‌ని తెలుస్తోంది. రాజ‌కీయాల‌పై గౌత‌మ్ రెడ్డి స‌తీమ‌ణికి ఆస‌క్తి లేక‌పోవ‌డం, పిల్ల‌ల‌ను చ‌ద‌వించుకోవాల‌ని ఆమె భావించ‌డం కార‌ణంగా సున్నితంగా జ‌గ‌న్ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించార‌ని స‌మాచారం.

కుటుంబ పెద్ద‌గా రాజ‌కీయాల్లోకి ఇష్టం లేకుండా కోడ‌ల‌ని తీసుకురావ‌డానికి రాజ‌మోహ‌న్ రెడ్డి అయిష్టంగా ఉన్నాడ‌ట‌. దీంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను జ‌గ‌న్ చూస్తున్నాడు. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లా నుంచి నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఉన్నాడు. ఆయ‌న బ‌దులుగా మ‌రొక‌రని మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌డానికి జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. ఆ జిల్లా నుంచి సీనియ‌ర్ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి , కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి ఆశావ‌హులుగా ఉన్నారు. నిజాయితీకి మారుపేరుగా ఉన్న కోటంరెడ్డికి షార్ట్ టెంప‌ర్ అనే పేరుంది. ఇక కాకాని ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీ చైర్మ‌న్ గా ఉన్నాడు. వీరిద్ద‌రిలో ఒక‌ళ్ల‌కు మంత్రి ప‌ద‌విని ఇస్తారా? లేక మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని మంత్రి ప‌ద‌వి వ‌రించ‌నుందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.