By: డా. ప్రసాదమూర్తి
Man of the Masses Nara Chandrababu Naidu : పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడు బయటపడలేకపోయాడు. అది మహాభారతం చెప్పిన కథ. ఆధునిక ఆంధ్రా రాజకీయ భారతం అదే కథను రిపీట్ చేస్తుందా, లేక ఆ కథకు మరో కొత్త ముగింపు ఇస్తుందా అన్నదే ఇప్పుడు పలు రకాల విశ్లేషణలకు, ఊహాగానాలకు, చర్చలకు, వాదోపవాదాలకు ఆధారభూతమైంది. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టయ్యారు. జగన్ తో పాటు జగన్ వర్గీయులంతా పండగ చేసుకుంటున్నారు.
చంద్రబాబు రాజమండ్రి జైల్లో కి ప్రవేశించడం చూసి బాబు అనుచరుగణం, ఆయన వర్గీయులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వారంతా ఆగ్రహ ప్రదర్శనలు, బందులు, వ్యూహ ప్రతి వ్యూహాల రచనల్లో తలమునకులయ్యారు. ఇదంతా ఓకే. బాబు అరెస్టుతో ఇక తెలుగుదేశం పార్టీ శకం ముగిసినట్టేనని, చంద్రబాబు జైల్లోనే కొనసాగితే రాజకీయంగా బయట చక్రం తిప్పి పసుపు జెండాని ఎన్నికల్లో విజయ పతాకంగా ఎగుర వేసే దమ్ము ఆయన కుమారుడికి గాని, పార్టీలో మరొకరికి గాని లేదని ప్రత్యర్థి వర్గాలు ఇక సంబరం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు ఇక్కడ చర్చకు వస్తాయి.
చంద్రబాబును జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన పార్టీ ఒంటరి అయినట్టేనా? ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని కొత్త మలుపులు తిప్పే అవకాశాలు ఉన్నాయా? అనేది నిజానికి ఇప్పుడు నిజంగా చర్చించాల్సిన విషయం. చంద్రబాబు (Chandrababu) అరెస్టు టైమింగ్ జగన్ స్క్రిప్టులో అతి కీలకమైందిగా భావించవచ్చు. అర్ధరాత్రి అరెస్టు చేశారా, తెల్లవారుజామున చేశారా? ఏ జైల్లో పెడతారు? ఎన్ని రోజులు రిమాండ్లో ఉంచుతారు, ఇలాంటి విషయాలు కాదు. చంద్రబాబును ఇప్పుడే అరెస్టు చేయడానికి జగన్ ఎంచుకున్న ముహూర్తంలో ముఖ్యాంశం ఒకటి ఉంది. ఎన్నికలు ఎలాగూ దగ్గర పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల్లో ఇంకా పొత్తుల విషయం ఖరారు కాలేదు. కేంద్రంలో ఉన్న బిజెపి, ఏపీ రాజకీయాల్లో ఎటువైపు ముగ్గు చూపుతుంది అనేది ఇంకా తేలలేదు. చంద్రబాబు (Chandrababu) బిజెపి వైపు చూస్తున్నారా..? బిజెపి చంద్రబాబు వైపు చూస్తుందా.. ? చంద్రబాబు, పవన్ చేతులు కలిపితే వారికి బిజెపి తోడై కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇతర పార్టీలు అన్నీ సంయుక్త శక్తిగా వైసీపీని ఢీకొంటాయా అనేది తేలలేదు. అంతా సస్పెన్స్ గానే ఉంది. అలాగే కేంద్రంలో దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్న ప్రతిపక్షాలు కూడా చంద్రబాబును పట్టించుకోవడం లేదు. కారణం చంద్రబాబు ప్రతిపక్షాల కూటమని గుర్తించకపోవడం.
Also Read: Balakrishna Warning : నేనొస్తున్నా.. ఎవరూ భయపడొద్దు.. అందరినీ కలుస్తా : బాలయ్య
బీజేపీకి దగ్గరైతే ప్రతిపక్షాలు దూరమవుతాయి. ప్రతిపక్షాలకు దగ్గరైతే బిజెపి దూరమవుతుంది. రెండింటినీ సమదూరంలో ఉంచి ఏపీ ఎన్నికల్లో తాను విజయం దిశగా పయనించాలని బాబు మాస్టర్ ప్లాన్. అయితే ఈ పథకంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలియదు. కానీ చంద్రబాబును అటు బిజెపి ఇటు విపక్షాలు అన్నీ దూరంగా ఉంచినప్పుడు, సమయం చూసి బాబు మీద వేటు వేస్తే ఆయన ఇంక మళ్ళీ కోలుకోలేని దెబ్బ తినగలడని జగన్ వర్గం ఆలోచించి ఉంటుంది. అయితే జగన్ వ్యూహం ఇప్పటికిప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడానికి పనికి రావచ్చు. కానీ ఇదే వ్యూహం చంద్రబాబును అటు ప్రతిపక్షాలకు ఇటు బిజెపికి దగ్గర చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
చంద్రబాబు దశాబ్దాల రాజకీయ అనుభవం ఇటు రాష్ట్రంలోనూ దేశంలోనూ రాజకీయ నాయకులందరికీ పరిచయమే. రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాదు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు తొలి దశలోనూ, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులోనూ చంద్రబాబు చక్రం తిప్పిన స్వర్ణ యుగం ఒకటి ఉంది. ఐ.కె. గుజ్రాల్, దేవగౌడ లాంటి వారిని ప్రధానులు చేయడంలో బాబు పాత్ర ప్రధానంగా ఉందని చెప్పుకుంటారు. ఒకానొక దశలో ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశానికి అత్యంత చేరువుగా బాబు చేరుకున్న విషయం కూడా అందరికీ గుర్తే. ఇలాంటి సమయంలో చంద్రబాబును ఒంటరి చేసి చోద్యం చూడాలని మిగిలిన ప్రతిపక్ష పార్టీలు గానీ, బిజెపి గాని కోరుకుంటాయని అనుకోలేం. చంద్రబాబు మీద రెండు వైరి పక్షాల సానుభూతి వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు.
అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకెళ్లి వచ్చి మహారాజుల్లా పరిపాలనా పగ్గాలు చేపట్టిన మహానుభావుల చరిత్రలు దేశానికేం కొత్తకాదు. ఏపీ ప్రజలకు అసలేం కొత్త కాదు. కాబట్టి అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లాడని చంద్రబాబుని ఏపీ ప్రజలు ఈసడిస్తారా.., అయ్యో ఈ వయసులో ఆయన్ని ఇన్ని బాధలు పెట్టారా అని ప్రజలు సానుభూతి వర్షం కురిపిస్తారా.. అనేది కూడా వెంటనే ఊహించలేం. కాబట్టి చంద్రబాబు ఇప్పుడు ఒంటరివాడయ్యాడా లేక ఒంటరివాడై జగన్ మినహా మిగతా అందరివాడయ్యే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడా అనేది ముందున్న కాలమే అందరికీ చెబుతుంది. చూడాలి కాలం ఎంత చిత్రమైందో, రాజకీయాలు అంతకంటే చిత్రమైనవి. ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Also Read: Skill Development : అసలు స్కిల్ డెవలప్ అంటే ఏంటి..? చంద్రబాబు హయాంలో ఏంజరిగింది.?