Site icon HashtagU Telugu

AP Assembly: హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. అధికారాలపై శాసనసభ చర్చించబోతోందా?

Dharmana Prasad Rao Imresizer

Dharmana Prasad Rao Imresizer

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారాల విభజన సిద్ధాంతం పై చర్చించాలని వైసీపీ భావిస్తోందా? మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీనికోసం ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఒకవేళ ఇదే అంశంపై సమావేశాలు కాని జరిగితే.. వ్యవస్థల మధ్య అధికార విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఏం చేయాలో.. వాటి అధికారాలేమిటో రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రజా పరిపాలన సజావుగా సాగడానికి, దేశాభివృద్ధికి, శ్రేయస్సుకు.. ఇది చాలా ముఖ్యం. కానీ ఇప్పుడీ తీర్పు నేపథ్యంలో ఈ వ్యవస్థల మధ్య పరిమితులు ఏమిటో శాసనసభలో సవివరంగా చర్చించాలన్నది ధర్మాన ప్రసాదరావు అభిప్రాయం. దీంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారాయి.

ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు… వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా ఉందన్న ధర్మాన.. ఈమేరకు సీఎంకు లేఖ రాశారు. గత ప్రభుత్వాల తప్పుడు విధానాలపై.. ప్రస్తుత వ్యవస్థలు సమీక్షలు చేయడం మమూలే. అలా చేయకుండా ఉండడానికేమీ ప్రజలు శాసనసభ్యులను ఎన్నుకోలేదన్న ధర్మాన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ ను పెంచాయి.

రాజ్యాంగం ప్రకారం లభించిన అధికారాలతోనే ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుంది. కాకపోతే ఆ వ్యవస్థల మధ్య విభేదాలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటన్నదే ప్రశ్న. ఇప్పుడు ధర్మాన వ్యాఖ్యలు ఆ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఒకవేళ ధర్మాన లేఖను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే.. పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది.