AP New Cabinet: జ‌గ‌న్ న‌యా కేబినెట్‌లో ధ‌ర్మాన..?

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 11:18 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్ర‌మంలో కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం, ఉగాది రోజున ఉండే అవ‌కాశం ఉంద‌ని అధికార‌ వైసీపీ పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ నడుస్తోంది. దీంతో కొత్త మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంది.. పాత వారిలో ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు పోతారు అనేది ఇప్పుడు ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆశ‌క్తిక‌రంగా మారింది.

ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నానిలకు ఎలాంటి ఢోకా లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ న‌లుగురు కాకుండా మిగిలిన మంత్రులంతా మాజీల జాబితాలో చేర‌నున్నార‌ని జోరుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక మ‌రోవిష‌యం ఏంటంటే జిల్లాల్లోని కార్య‌క‌ర్త‌లు త‌మ అభిమాన నేత‌ల అవ‌కాశాల‌పై ఎవ‌రికి వారే లెక్క‌లు వేసుకుంటూ జోరుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లాలో మంత్రుల జాబితాలో ఎవ‌రు ఉంటారో, ఎవ‌రు పోతారో అనే అంశం పై కీల‌క చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల్రాజు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్నాన కృష్ణదాస్ జగన్ కేబినెట్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఇద్ద‌రు మంత్రుల‌ను సీఎం జగన్ మారుస్తారనే టాక్ వినిపిస్తుంది. దివంగ‌త వైఎస్ఆర్ మ‌ర‌ణించిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌కు తొలి నుంచి మ‌ద్ద‌తు ఇచ్చిన నేత‌ల్లో ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఒక‌ర‌నే విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను, ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీని కాద‌ని, వైసీపీలో చేరారు.

దీంతో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, జ‌గన్ తొలి మంత్రివ‌ర్గంలో కృష్ణదాస్‌కు రెవెన్యూ వంటి కీలక శాఖను కేటాయించిన‌ జగన్, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదా కూడా కట్టబెట్టారు. అయితే ఇప్పుడు రెండున్నర ఏళ్ల గడువు ముగియడంతో ధర్మాన కృష్ణదాస్‌ను తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఆయన స్థానంలో మరో సీనియర్ నేత, మాజీ మంత్రి, ధర్మాన కృష్ణదాస్‌ సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు కొత్త కేబినెట్‌లో చోటు ద‌క్క‌నుంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి దివంగ‌త ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ధ‌ర్మాన ప్ర‌సాదరావు కీల‌క పాత్ర పోషించారు.

నాడు వైఎస్ఆర్ హ‌యాంలో రెవెన్యూ శాఖ‌ను నిర్వ‌హించిన ధర్మాన ప్ర‌సాద రావు, వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన ధ‌ర్మాన, 2019 ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేతగానూ, బీసీ నేత‌గానూ త‌న‌కంటూ ప్ర‌త్యేత గుర్తింపు ఉన్న నేత‌గా ధ‌ర్మాన ప్ర‌సాద రావు ఉన్నారు. అంతే కాకుండా ప‌రిపాల‌న ప‌ర‌మైన అంశాల‌పై కూడా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు గ‌ట్టి ప‌ట్టుంది. దీంతో ఈసారి మంత్రి వ‌ర్గంలో ధ‌ర్మాన ప్ర‌సాద్‌కు చోటు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని శ్రీకాకుళం జిల్లాలోని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మరి జగన్ న‌యా కేబినెట్ లిస్ట్‌లో ధర్మాన ప్రసాదరావు పేరు ఉందో లేదో అనేది చూడాలి.