శ్రీశైలం ఆలయానికి భక్తులు పొటెత్తారు. నెలరోజుల పాటు కార్తీక మాసం ఉత్సవాలు ముగియనున్న తరుణంలో వారాంతపు సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ కనిపించింది. శ్రీశైలం వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని కేవలం 48 గంటల్లోనే రెండు లక్షల మంది యాత్రికులు దర్శించుకున్నారు. సోమవారం నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆలయంలో భక్తుల రద్దీ పెరగడంతో ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అసౌకర్యం లేకుండా దర్శనం సజావుగా ఉండేలా దేవస్థానం అధికారులు అదనపు సిబ్బందిని కేటాయించారు. భక్తుల రద్దీతో నల్లమల అటవీ ఘాట్ సెక్షన్‌లో ఆదివారం రాత్రి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సున్నిపెంట, దోర్నాల మార్గాల్లో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు జిల్లా యంత్రాంగం అదనంగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు (సోమవారం, డిసెంబర్ 11) చివరి కార్తీక సోమవారంతో ఆలయ ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులకు వసతి, భోజనం, తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. సాధారణ దర్శనానికి 6–7 గంటల సమయం పడుతుందని, ప్రత్యేక దర్శనానికి ఆదివారం 5–6 గంటల సమయం పట్టిందని తెలిపారు.
Also Read: Pregnant Women : ఏజెన్సీలో గర్భిణీల దీనస్థితి.. ఆసుప్రతికి వెళ్లాలంటే డోలీలోనే..!