Site icon HashtagU Telugu

Shivaratri: మార్మోగుతున్న శివనామస్మరణ!

Srisailam1

Srisailam1

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. వేలాది మంది పాద యాత్రికులతో పాటు బస్సుల్లో, సొంత వాహనాల్లో భక్తులు కొండకు చేరుకున్నారు. 8 వేలకుపైగా వాహనాలు పార్కింగ్‌ స్థలాల్లో కిక్కిరిశాయి. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో ఆలయ మాడ వీధులు, పురవీధులు, ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. శివనామస్మరణతో శ్రీశైలం మార్మోగింది. పాదయాత్రగా వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనానికి ఆరు గంటలకుపైగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటలకుపైగా సమయం పడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ఉత్తర మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేక మండపం ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మల్లికార్జునస్వామికి లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గర్భాలయ విమాన గోపురానికి పాగాలంకరణ, రాత్రి 12 గంటలకు బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.

ఇక తెలంగాణలోని కీసర గుట్ట, వేములవాడతోపాటు ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీసరగుట్టలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకొని హైదరాబాద్, పరిసర ప్రాంతాల భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు చేస్తూ.. శివ ఆరాధనలో స్మరిస్తున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తుల కోసం ఆలయాలు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటుచేశాయి. శివరాత్రి రాకతో తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణ మార్ముగుతోంది.