Site icon HashtagU Telugu

TTD : తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి పోటెత్తిన భక్తులు  .. ద‌ర్శ‌నానికి 30 గంట‌ల స‌మ‌యం

Tirumala devotee

Tirumala devotee

తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల ర‌ద్ధీ మ‌రింత పెరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. తమిళనాడు ప్రజలకు పవిత్రమైన పురటాసి మాసం మూడో శనివారం కావడంతో రద్దీ పెరిగినట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టి ఔటర్‌ రింగురోడ్డుపై క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు వర్షంలో తడవకుండా క్యూలైన్లలో వెళ్తున్నారు. మరోవైపు దసరా సెలవులు, ఉద్యోగులకు వరుస సెలవులు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది. తిరుమలలో ఈ నెల 4వ తేదీ వరకు సాధారణంగానే ఉన్న భక్తుల రద్దీ 5వ తేదీ మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి గార్డెన్స్‌లోని అన్ని షెడ్లు భక్తులతో నిండిపోగా, భక్తులు 5 కిలోమీటర్ల మేర క్యూలో బారులు తీరారు. దర్శనాలు పూర్తి చేసేందుకు 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.