Bezawada Politics : దేవినేని Vs వంగ‌వీటి.. మ‌ళ్లీ తెర‌పైకి పాత‌క‌క్ష‌లు.. ?

బెజ‌వాడ రాజ‌కీయాల్లో టీడీపీ యువనేత వంగ‌వీటి రాధా కామెంట్స్ ఇప్పుడు వేడిపుట్టిస్తున్నాయి. ఆయ‌న తండ్రి దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో రాధా సంచ‌న‌ల కామెంట్స్ చేశారు. త‌న‌ను చంపేందుకు కొంద‌రు కుట్ర చేస్తున్నార‌ని మంత్రి కొడాలిని నాని సాక్షిగా కామెంట్స్ చేశారు

  • Written By:
  • Publish Date - December 29, 2021 / 10:29 AM IST

బెజ‌వాడ రాజ‌కీయాల్లో టీడీపీ యువనేత వంగ‌వీటి రాధా కామెంట్స్ ఇప్పుడు వేడిపుట్టిస్తున్నాయి. ఆయ‌న తండ్రి దివంగ‌త నేత వంగ‌వీటి మోహ‌న రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో రాధా సంచ‌న‌ల కామెంట్స్ చేశారు. త‌న‌ను చంపేందుకు కొంద‌రు కుట్ర చేస్తున్నార‌ని మంత్రి కొడాలిని నాని సాక్షిగా కామెంట్స్ చేశారు.ఈ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. టీడీపీ కేంద్ర కార్యాల‌యం, ప‌ట్టాభి ఇంటిపై దాడి జ‌రిగిన త‌రువాత రాధా కార్యాల‌యం వ‌ద్ద కొంత‌మంది రెక్కీ నిర్వ‌హించార‌ని రాధా అనుచ‌రులు చెప్తున్నారు. అయితే ఇప్ప‌టికే రెక్కీ నిర్వ‌హించింది ఎవ‌రు అనే దానిపై రాధా,ఆయ‌న అనుచ‌రులు క్లారిటీకి వ‌చ్చారు. దీనిపై త‌న దగ్గ‌ర అన్ని ఆధారాలున్నాయ‌ని…పోలీసులు అడిగితే అన్ని చెప్తాన‌ని రాధా తెలిపారు. త‌న‌కు ప్ర‌భుత్వం కేటాయించిన గ‌న్ మెన్ల‌ను సైతం రాధా వెన‌క్కి పంపార‌ని..రంగా అభిమానులు, ప్ర‌జ‌లే త‌న‌కు ర‌క్ష‌ణ అని రాధా తెలిపారు.

ఇదిలా ఉంటే రాధా కార్యాల‌యంపై రెక్కీ నిర్వ‌హించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నార‌ని అందులో భాగంగా వైసీపీ కార్పోరేట‌ర్ అర‌వ స‌త్యంని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అర‌వ స‌త్యం దేవినేని కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూకి ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న అర‌వ స‌త్యం నెహ్రూ కుమారుడు అవినాష్ కి కూడా ఇప్పుడు ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్నారు. మూడు ద‌శాబ్దాలకుపైగా బెజ‌వాడ‌లో వంగ‌వీటి, దేవినేని కుటుంబాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. వంగ‌వీటి రంగా హ‌త్య త‌రువాత ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాధా ఈ ఫ్యాక్ష‌న్ కి చెక్ పెట్టారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఎక్క‌డా కూడా రాధా వివాద‌స్పద‌మైన కామెంట్స్ కానీ త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై చేయ‌లేదు.దీంతో బెజ‌వాడ‌లో ఈ ఫ్యాక్ష‌న్ పోయింద‌ని అంద‌రూ భావిస్తుండ‌గానే.. తాజాగా రాధా కార్యాల‌యంపై రెక్కీ నిర్వ‌హించ‌డం..దాని వెనుక దేవినేని నెహ్రూ అనుచ‌రులు ఉన్నార‌నే ఆరోప‌ణ‌లతో మ‌రోసారి ఈ పాతక‌క్ష‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అయితే అర‌వ స‌త్యం కుమారుడు మాత్రం త‌న తండ్రి పోలీసుల అదుపులో ఉన్నాడ‌నే వార్త‌ల‌ను కొట్టిపారేశారు. త‌న తండ్రికి ఆరోగ్యం బాగాలేక ఆంధ్రా ఆసుప‌త్రిలో చేరార‌ని… 48 గంట‌ల పాటు అబ్జ‌ర్వేష‌న్ లో ఉంచాల‌ని వైద్యులు చెప్పిన‌ట్లు అర‌వ స‌త్యం కుమారుడు చ‌ర‌ణ్ తేజ్ తెలిపారు. మీడియా లో త‌న తండ్రి వంగవీటి రాధా పై రెక్కీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయని..ఇదంతా అవాస్త‌మ‌న్నారు. త‌మ కుటుంబంపై బురద జ‌ల్ల‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాన‌ని.. బయట జరుగుతున్న ప్రచారానికి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని చ‌ర‌ణ్ తేజ్ తెలిపారు. అర‌వ స‌త్యం నెహ్రూ అడుగుజాడల్లో నడిచారని.. దేవినేని అవినాష్ త‌మ కుటుంబానికి అండ‌గా నిలుస్తున్నార‌ని తెలిపారు.

అర‌వ స‌త్యం కుమారుడు అర్థ‌రాత్రి హుటాహుటిన ఆసుప‌త్రికి చేరుకుని అక్క‌డే ప్రెస్ మీట్ పెట్టి దీనిని ఖండించారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు వంగావీటి రాధా ద‌గ్గ‌ర నుంచి ఇంత‌వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం సేక‌రించలేదు. త‌న‌పై రెక్కీ నిర్వ‌హించింది ఎవ‌రో త‌న‌కంటే పోలీసుల ద‌గ్గ‌రే ఆధారాలు ఎక్కువ ఉన్నాయ‌ని రాధా చెప్ప‌డం పోలీస్ శాఖ‌లో క‌ల‌క‌లం రేపుతుంది. ఇంత‌జ‌రుగుతున్నా పోలీసులు స్పందించ‌క‌పోవ‌డంతో రంగా, రాధా అభిమానులు ఆగ్ర‌హం వ‌క్తం చేస్తున్నారు. మ‌రి పోలీసులు ఈ కేసుని ఎలా డీల్ చేసి క్లోజ్ చేస్తారో చూడాలి