TDP vs YCP : ఎంపీ కేశినేని నానిపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్‌.. ఎంపీ పదవికోసం ఇంతగా దిగజారాలా..!

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 06:48 AM IST

టీడీపీని వీడి వైసీపీలో చేరిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానిపై మాజీమంత్రి దేవినేని ఉమా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రజలిచ్చిన అధికారంతో ల్యాండ్..శాండ్.. వైన్.. మైన్.. సెంటు పట్టాలు, ఇతర కుంభకోణాల్లో రూ.2.50లక్షల కోట్లు దోపిడీచేసిన ఒక అవినీతిపరుడి పక్కన చేరిన కేశినేని నాని.. చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా అని నానీని ప్రశ్నించారు. నిన్నటి వరకు ఆహా..ఓహో అన్న నోటికి ఇప్పుడు మేం చెడ్డవాళ్లమైపోయామా?  ఎంతమంది టీడీపీ కార్యకర్తల రెక్కల కష్టంతో తాను రెండుసార్లు ఎంపీగా గెలిచాడో నాని మర్చి పోయినా.. త‌మ‌ పార్టీ మర్చిపోలేదన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా నాని విమర్శించాడో తెలుసని.. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నానీ ఆయన్ని క‌లిశార‌న్నార‌. అప్పుడు చంద్ర‌బాబు.. కేశినేని నానీకి విజయవాడ ఎంపీగా అవకాశమిచ్చారని తెలిపారు.విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి చంద్రబాబు వందలకోట్లు కేటాయించారని.. టీడీపీప్రభుత్వంలో ప్రారంభమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఆగిపోతే ఏనాడైనా నానీ, ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారా అని ప్ర‌శ్నించారు. కేశినేని నానీకి ప్రోటో కాల్ పిచ్చి తప్ప.. విజయవాడ అభివృద్ధి పట్టదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరం బ్రహ్మండంగా అభివృద్ధి చెందిందని.. కృష్ణా జిల్లా టీడీపీ నాయకత్వం సామూహికంగా విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేసిందన్నారు. పుష్కరాల సమయంలో వందలకోట్లతో కృష్ణానది వెంబడి ఘాట్ లు నిర్మించి, రోడ్లు వేసింది టీడీపీప్రభుత్వమేన‌ని తెలిపారు. టీడీపీప్రభుత్వంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఎస్సీల అభివృద్ధికి, ఎస్టీలు.. బీసీలు..మైనారిటీల అభివృద్ధికి ఎన్నికోట్లు ఖర్చుపెట్టారో నానీకి తెలుసా ? అని ప్ర‌శ్నించారు. కేంద్రమంత్రి గడ్కరీతో మాట్లాడి కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మించింది చంద్రబాబు కాదా? గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి నాడు కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు చొరవతీసుకుంది నిజం కాదా? విజయవాడ నగరంతోపాటు, చుట్టు పక్కల పచ్చదనం-పరిశుభ్రత కోసం టీడీపీప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందో నానీకి తెలియదా? అని ప్ర‌శ్నించారు. దేశంలోని అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో చంద్రబాబు ఒకడని పొగిడిన నానీకి, నేడు అదే చంద్రబాబు మోసగాడు అయ్యాడా? అని ప్ర‌శ్నించారు. వ్యాపారంలో నష్టాలొచ్చి.. ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికే నానీ తన ట్రావెల్స్ వ్యాపారం వదులుకున్నాడు తప్ప.. చంద్రబాబు చెప్పాడని కాదని తెలిపారు. గతకొన్ని సంవత్సరాలుగా నానీ టీడీపీలో ఉంటూ సొంతపార్టీ నాయకుల్ని నోటికొచ్చినట్టు తిట్టింది నిజం కాదా? అన్నింటికంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడు జైలు నుంచి వచ్చాక కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంలో, అహాంకారంతో నానీ మాట్లాడిన మాటలకు సాక్షాత్తూ ఆ తల్లి కనకదుర్గమ్మే నేడు ఆయన పతనానికి దారిచూపింది. దుర్గమ్మ సన్నిధిలో నానీ దుర్భాషలాడార‌ని దేవినేని తెలిపారు.

Also Read:  Power Policy Soon: తెలంగాణలో సమగ్ర విద్యుత్ విధానం: సీఎం రేవంత్