Minister Narayana : తిరుపతిలో అత్యాధునికంగా నిర్మిస్తున్న తుడా టవర్స్‌ను జూన్ చివరికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మునిసిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ తెలిపారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తుడా టవర్స్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం పత్రికలతో మాట్లాడుతూ..ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాం. ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు జూన్ చివరినాటికి పూర్తిచేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు అని అన్నారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మంత్రి నారాయణ పూర్తి అవగాహన లేకుండా క్రమశిక్షణ లేని విధంగా టౌన్ ప్లానింగ్ చేశారు. తిరుపతిలో ఇంటింటి సర్వే నిర్వహించగా అనేక లేఔట్స్, భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడినట్టు గుర్తించాం. అందుకే ప్రజలకు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్‌ఎస్), బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీపీఎస్) అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరాం అని తెలిపారు. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ఇది భవిష్యత్ తరాలకు అవసరమైన అభివృద్ధి. దీనికి అనుగుణంగా నగర నిర్మాణ నిబంధనలను సరళతరం చేశాం. నిర్మాణ అనుమతుల విషయంలో పారదర్శకత పెంచాం. కూటమి ప్రభుత్వంలో ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూసుకుంటాం అని వివరించారు.
టీడీఆర్ బాండ్ల సమస్యపై స్పష్టత
రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) బాండ్ల సమస్య పెరుగుతోందని మంత్రి తెలిపారు. తణుకు ప్రాంతంలో రూ.50 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను రూ.750 కోట్లకు జారీ చేశారు. ఇది పెద్ద స్కామ్. తిరుపతిలో మొత్తం 1077 టీడీఆర్ బాండ్లు దాఖలయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 709 బాండ్లను మంజూరు చేశాం. ఇంకా 368 బాండ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 59 బాండ్లు న్యాయపరమైన సమస్యలతో ఎదురుగా ఉన్నాయి. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి నారాయణ వెల్లడించారు.
నిబంధనల మేరకు అభివృద్ధి ముఖ్యం
నిర్మాణాలు చేసే వారు టౌన్‌ప్లానింగ్ నిబంధనలను పాటిస్తే అందరికీ మేలు జరుగుతుందని మంత్రి సూచించారు. నియమాలను పాటించకుండా నిర్మాణాలు చేస్తే తర్వాత సమస్యలు తలెత్తుతాయి. అందుకే ప్రజలకు తగిన అవగాహన కల్పించడమే మా ధ్యేయం. మేం రూపొందించిన ప్లానింగ్ మార్గదర్శకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తాయి అని చెప్పారు.
తిరుపతి అభివృద్ధికి కేంద్రంగా
తిరుపతిని ఉన్నత ప్రామాణికాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తుడా టవర్స్, రోడ్డు విస్తరణలు, డ్రైనేజీ ప్రాజెక్టులు, పాతబస్తీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాల్లో వేగంగా పని జరుగుతోందని వివరించారు. తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల సహకారం, నిబంధనల పాటనతో మెగాసిటీ లక్ష్యం త్వరలోనే సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.