Gandi Kota Development: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని గండికోటను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసింది. రూ. 77.91 కోట్ల నిధులను కేంద్రం ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో గండికోటను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో గండికోటను అభివృద్ధి (Gandi Kota Development) చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని సమాచార భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్ల నిధులను కేటాయించినందుకు కేంద్ర మంత్రిత్వ శాఖకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
వివరాల్లోకి వెళితే.. చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరిస్తూ ఆ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవ ఫలించింది. పెమ్మసాని ప్రయత్నానికి స్పందిస్తూ గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ. 77.91 కోట్లను గురువారం మంజూరు చేసింది. గండికోట ప్రాభవం, ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసేలా అభివృద్ధి చేయించేందుకు పెమ్మసాని నడుం బిగించారు. అందుకు గాను నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు పెమ్మసాని గడిచిన నవంబర్ 4న లేఖ రాశారు. అనంతరం కేంద్ర మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ నిధుల మంజూరుకు కృషి చేశారు.
ఈ క్రమంలో స్పందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో పలు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాలలో గండికోటకు కూడా ప్రముఖ స్థానం కల్పించింది. అందులో భాగంగా గండికోట అభివృద్ధితో పాటు పరిసర నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అందుబాటులోకి తెచ్చేందుకు గాను నిధులను కేటాయించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ స్పందనకు పెమ్మసాని కృతజ్ఞతలు తెలియజేశారు.