Cock Fights:ఏపీలో య‌దేచ్ఛ‌గా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయ‌లు

ఏపీలో కోడిపందాల‌పై ఆంక్ష‌లు పెట్టిన వాటిని పందెం రాయుళ్లు బేఖాత‌రు చేశారు. కోడిపందాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భోగి పండుగ సందర్భంగా కోడిపందాలు భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.

  • Written By:
  • Updated On - January 15, 2022 / 10:40 AM IST

ఏపీలో కోడిపందాల‌పై ఆంక్ష‌లు పెట్టిన వాటిని పందెం రాయుళ్లు బేఖాత‌రు చేశారు. కోడిపందాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భోగి పండుగ సందర్భంగా కోడిపందాలు భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. సంప్రదాయ పూజలు చేసిన అనంతరం నిర్వాహకులు పందాల‌ను ప్రారంభించారు. కొన్ని చోట్ల ప్ర‌జాప్ర‌తినిధులు ఈ పందాల‌ను ప్రారంభించారు. వేదికలన్నీ పందెంరాయుళ్లు, సామాన్య ప్రజలతో కిటకిటలాడాయి. అర్థ‌రాత్రి సైతం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కోడి పందాలు నిర్వహించారు. 15 ఏక‌రాల్లో పందెం బ‌రులు, 5 ఏక‌రాల్లో కార్ పార్కింగ్ ని ఓ చోట ఏర్పాటు చేశారు. వరి పొలాలు, కొబ్బరి, మామిడి తోటల్లో ఈ బ‌రులు ఏర్పాటు చేసి వ‌చ్చే వారికి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా భారీ టెంట్లు వేశారు. వేదికల వద్ద హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పాన్ అవుట్‌లెట్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందాల వేడుకలు భారీ ఎత్తున జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యంగా పాలకొల్లు, భీమవరం, తణుకు, జంగారెడ్డిగూడెం, తాళ్లపూడి, ఉండి తదితర ప్రాంతాల్లో పందాలు భారీ ఎత్తున‌ జరుగుతున్నాయి. కోనసీమ ప్రాంతంలో ఒక్కో మండలానికి కనీసం ఐదు నుంచి ఏడు పందెం బ‌రుల‌ను ఏర్పాటు చేశారు. కోడిపందాల నిర్వ‌హాణ‌పై ఆంక్షలు ఉన్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. గోదావరి తీరంలో కోడిపందాలు ఆపేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జిల్లాలోని కాట్రేనుకోన మండలం పల్లంకుర్రు గ్రామం, ఐ పోలవరం, రావులపాలెం, పెద్దాపురం, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో కోడిపందాలను పలువురు విద్యార్థులు, యువకులు తిలకించారు. కోడిపందాల వేదికల సమీపంలోని కొన్ని రహదారుల్లో తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. గోదావరి బెల్ట్‌లో పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 విధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కోనసీమ ప్రాంతంలో కాట్రేనుకోన మండలం పల్లంకుర్రు గ్రామంలో పెద్ద పెద్ద బ‌రుల‌ను ఏర్పాటు చేయ‌డంతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. గోదావరి జంట జిల్లాల్లో భోగి సందర్భంగా దాదాపు రూ.1000 కోట్లు పైగానే చేతులు మారాయి. పందెల కోసం కోడిపుంజుల‌ను పెద్ద‌పెద్ద కార్లలో పందెం రాయుళ్లు తీసుకువచ్చారు. మరోవైపు గత కొద్ది రోజులుగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పోలీసులు పండుగ సందర్భంగా కోడి పందేలకు సిద్ధమైన బ‌రుల‌ను ధ్వంసం చేశారు. అయిన‌ప్ప‌టికి పందాలు కోన‌సాగాయి.

రెండు జిల్లాల పోలీసులు గత వారం రోజుల్లో 100కు పైగా పందెం బ‌రుల‌ను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామచంద్రాపురం, రాజానగరం, కోనసీమ, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో బుల్ డోజర్లు, ట్రాక్టర్ల సాయంతో వీటిని ధ్వంసం చేశారు. తెలంగాణ, కర్ణాటక వంటి సుదూర ప్రాంతాల నుంచి, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి కోడిపందాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్య‌లో త‌రలి వ‌చ్చారు. బ‌రుల వ‌ద్దే క్యాష్ కౌంటింగ్ మిష‌న్ల‌ను నిర్వ‌హాకులు ఏర్పాటు చేశారు. ల‌క్ష‌ల రూపాయ‌ల్లో పందెలు నిర్వ‌హిస్తుండ‌టంతో డ‌బ్బులు లెక్క‌పెట్ట‌డం ఇబ్బందిగా ఉండ‌టంతో వీటిని ఏర్పాటు చేశారు. కోడిపందాల బ‌రుల మాటున పేకాట శిభిరాలు పెద్ద ఎత్తున వెళిశాయి. కోడిపందాల్లో ఎంత‌గా బెట్టింగ్ జ‌రుగుతుందో అంతేస్థాయిలో పేకాట‌లో కూడా బెట్టింగ్ జ‌రుగుతుంది. మొత్తానికి మొద‌టి రోజు ఏపీ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయ‌లు కోడిపందాల్లో చేతులు మారిన‌ట్లు తెలుస్తోంది.