Ap Deputy cm pawan kalyan serious on bhimavaram dsp : భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీ జయసూర్య అవినీతికి పాల్పడుతున్నారని.. జూద శిబిరాలకు సహకరిస్తున్నారని అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీకి లేఖ రాయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా డీఎస్పీకి మద్దతు తెలపడంతో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. చివరకు శాఖాపరమైన విచారణ తర్వాత.. జయసూర్యను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురైన డీఎస్పీ జయసూర్యపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. భీమవరం డీఎస్పీగా పనిచేస్తున్న జయసూర్యపై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. భీమవరం నియోజకవర్గంలో పేకాట క్లబ్బుల నిర్వహణకు ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని.. నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని జనసేన నేతలు తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు.
ఆస్తి తగాదాలు, ప్రైవేటు సెటిల్మెంట్లలో డీఎస్పీ జయసూర్య తలదూరుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన పవన్ కళ్యాణ్.. స్వయంగా జిల్లా ఎస్పీ, డీజీపీతో మాట్లాడి నివేదిక కోరారు. ఈ క్రమంలోనే పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. తాజాగా భీమవరం డీఎస్పీ జయసూర్యపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భీమవరం డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వివాదం ఒకానొక దశలో కూటమిలోని నేతల మధ్య చర్చకు దారితీసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ వివాదంపై స్పందిస్తూ.. జయసూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉందని.. జూద శిబిరాలపై ఆయన నిఘా పెట్టడం వల్లే కావాలని కొందరు ఆరోపణలు చేస్తున్నారని మద్దతు పలికారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగడంతో రఘురామ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అటు.. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా డీఎస్పీకి మద్దతు పలకడం గమనార్హం.
శాఖాపరమైన విచారణలో ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. డీఎస్పీ జయసూర్యను వెంటనే విధుల్లోంచి తొలగించి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. జయసూర్య స్థానంలో రఘువీర్ విష్ణును భీమవరం కొత్త డీఎస్పీగా నియమించారు.
