Deputy CM Pawan review on Eleru floods: ఏపీ ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్( Deputy CM Pawan Kalyan) ఏలేరు వరదలపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏలేరు రిజర్వాయర్కి జల ప్రవాహం పెరుగుతుండటం, వర్షాల మూలంగా వరద ముప్పు పొంచి ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. ఆదివారం ఉదయం నుంచి పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చిస్తున్నారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్కి ఇప్పటికే 21 టీఎంసీలకు చేరిన క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలోని ప్రజలకు అవసరమయిన సహాయక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం.. యంత్రాంగాన్ని అప్రమత్తం..
కాకినాడ జిల్లా కలెక్టర్ పరిస్థితిని వివరిస్తూ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ ఫ్లో ఉదయం 4 వేలు క్యూసెక్కులు ఉంటే, సాయంత్రానికి 8 వేలు క్యూసెక్కులు ఉందన్నారు. రాత్రికి 10 వేల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేశామని డిప్యూటీ సీఎంకు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో జగనన్న కాలనీ, సూరంపేట కాలనీ, కోలంక, మాదాపురం, నవఖండ్రవాడ ప్రాంతాలపై వరద ముంపు ప్రభావం ఉంటుందని, యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు (సోమవారం) కాకినాడ వెళ్లనున్నారు. కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షిస్తారు. ఏలేరు వరద ముప్పు పొంచి ఉన్న క్రమంలో నియోజకవర్గంలో ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారు.