Site icon HashtagU Telugu

Chandrababu- Pawan Kalyan Meet: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.. ఇందుకోసమేనా?

Chandrababu Pawan Kalyan Meet

Chandrababu Pawan Kalyan Meet

Chandrababu- Pawan Kalyan Meet: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) మధ్య ఇవాళ భేటీ జరుగనుంది. ఈ భేటీ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబు నివాసంలో జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యంగా కాకినాడ పోర్టు (Kakinada Port) వ్యవహారం, అలాగే ఇతర కీలక రాజకీయ అంశాలపై చర్చ జరగనుంది. ఇటీవల వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, ఈ భేటీ కీలకంగా మారే అవకాశం ఉంది.

అదే సమయంలో, రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఈ సమావేశం 4న జరగాల్సి ఉండగా, తాజాగా 3వ తేదీ మంగళవారం జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులను విడుదల చేసారు, 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా, అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.

కాకినాడ నుంచి రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న అంశంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం:

కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్నట్లు వస్తున్నా తాజా సమాచారం నేపథ్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు తమ పద్ధతులు మార్చుకోకుండా మాఫియాకు సహకరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

“రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుండటానికి అధికారులే కారణమని” పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. “ఏం చేస్తున్నారు మీరంతా?” అని మండిపడుతూ, అక్కడి అధికారులను తీవ్రంగా తిట్టారు.

తదుపరి, కాకినాడ జిల్లా ఎస్పీకి చెప్పిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను ఎప్పుడు జిల్లాకు వచ్చిన, ఆయన అక్కడ ఉండడు. ఆయన ఎప్పుడు సెలవులపై  ఉంటాడు,” అంటూ ఆయన ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా, ఎస్పీకి నోటీసులు పంపాలని పవన్ కల్యాణ్ కోరే అవకాశం ఉంది. ఆయన కాకినాడ పోర్టు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మరియు కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని హెచ్చరించారు.

శుక్రవారం మధ్యాహ్నం, కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా  మధ్యాహ్నం 12:45 గంటలకు యాంకరేజ్ పోర్టులో భారీ తనిఖీ జరిగింది. అక్కడ రేషన్ బియ్యం ఎగుమతి అవుతూ ఉండటంతో, ఇటీవలే ఈ మార్గం ద్వారా అక్రమ రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించిన కొన్ని కేసులు వెలుగు చూశాయి. పవన్ కళ్యాణ్, నేరుగా బార్జిలోకి ఎక్కి, బియ్యాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా, డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారి మరియు ఇతర సంబంధిత అధికారులను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “రేషన్ మాఫియాకు మీరు ఎవరూ సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతున్నాయి?” అంటూ మండిపడ్డారు. “మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? లేక మాఫియాకు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారా?” అని ప్రశ్నించారు.

అందరినీ ఉద్దేశించి, టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును కూడా ఉద్దేశించి, ఈ సమస్యపై మరింత తీవ్ర పోరాటం చేపట్టాలని, నెమ్మదిగా ఉండొద్దని పవన్ సూచించారు. అనంతరం, మధ్యాహ్నం ఒంటి గంట తరువాత, పవన్ కళ్యాణ్ డీప్‌వాటర్ పోర్టుకు చేరుకొని, అక్కడి నుంచి టగ్ బోటులో ఎక్కి సముద్రం లోకి వెళ్లారు.

సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా…

తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో, అధికారులు పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్తారని అనుకోలేదు. కానీ ఆయన అనూహ్యంగా టగ్ బోటులో ఎక్కి, తొమ్మిది నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న పశ్చిమ ఆఫ్రికా నౌక, “స్టెల్లా ఎల్ పనా మా” వద్దకు బయలుదేరారు. సముద్రం భయానకంగా ఉండటంతో, అధికారులు ఆయనను పోటు వద్దనే నిలిపి, సముద్రంలో వెళ్లకూడదని వారించారు. కానీ పవన్ కళ్యాణ్ వారు చెప్పినదానికి అంగీకరించలేదు.

నౌక వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్, పైకి ఎక్కి 640 టన్నుల రేషన్ బియ్యాన్ని పరిశీలించాలి అన్నారు. అయితే, అక్కడి పరిస్థితి మరింత దుర్బలంగా ఉండడంతో, అధికారులు పవన్‌కు నౌకపైకి ఎక్కకూడదని సూచించారు. అయితే, పవన్ కళ్యాణ్ అక్కడి పరిస్థితులను నిఘా పెట్టి, ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని పరిశీలించారు.

సముద్ర ప్రయాణం మధ్యలో, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. “రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి” అని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, “సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్ మొత్తం ఫెయిల్ అయింది” అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్, “స్టెల్లా ఎల్ పనా మా” నౌకను సీజ్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశం ఇచ్చారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఉన్న అధికారులు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలని, ఈ క్రింద సముద్రం ద్వారా ఎగుమతి జరుగుతున్న రేషన్ బియ్యం పట్ల క్రమంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోర్టులో ఉన్న రెండు చెక్‌పోస్టుల వద్ద 24 గంటలు నిఘా పెడితే, ఇది మాఫియా కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడతుందని పవన్ సూచించారు.

కాకినాడలో రేషన్‌ మాఫియా:

పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం 3 గంటల తర్వాత డీప్‌వాటర్ పోర్టుకు తిరిగి చేరుకుని విలేకరుల సమావేశంలో రేషన్ మాఫియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాకినాడలో రేషన్ మాఫియా దారుణంగా పెరిగిపోయింది” అంటూ ఆయన పేర్కొన్నారు.

పవన్, తనను నౌక ఎక్కనీయకుండా అధికారులు అడ్డుకోవడం పై అసహనం వ్యక్తం చేసి, “రేషన్ మాఫియా క్షేత్ర స్థాయిలో విస్తరించిందని, రెండు నెలలుగా కాకినాడ పోర్టులో తనిఖీలు చేయడానికి నేను రావాలన్నా, అధికారులు ఏవో సాకులు చెప్పి నన్ను అడ్డుకుంటున్నారు” అని ఆరోపించారు.

అయితే, ఈ విషయాన్ని పవన్ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. “నేను ఢిల్లీ నుండి అమరావతికి వెళ్లాలని అనుకున్నాను, కానీ రేషన్ మాఫియాకు అడ్డంకిగా నిలిచిన ఈ పరిస్థితుల కారణంగా కాకినాడ పర్యటనకు వచ్చాను” అని ఆయన వెల్లడించారు.

గ్రీన్‌ ఛానల్‌ ద్వారా తరలింపు

అంతకుముందు, మంత్రి నాదెండ్ల మనోహర్ గౌరవనీయంగా మాట్లాడారు. “గత జూన్‌లో కాకినాడలో జరిగిన తనిఖీలో 26,000 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్నాం” అని ఆయన చెప్పారు. “ఈ బియ్యం మాఫియా గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల నుండి గ్రీన్ ఛానల్ ఏర్పాటుచేసి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నది” అని ఆయన వివరించారు. గ్రీన్ ఛానల్‌ ఉపయోగించి అక్రమ తరలింపు చేస్తే, “ఆక్రమ రేషన్ మాఫియాకు కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.

కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఈ దందా గురించి తీవ్రంగా స్పందించారు. “ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడే వ్యాపారం చేసేవారు. ఇప్పుడు అధికారంలో లేని వారు కూడా ఈ దందా కొనసాగిస్తుండటం, మాఫియాకు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు” అని ఆయన ఆరోపించారు. విలేకరుల సమావేశం అనంతరం, పవన్ కళ్యాణ్ అమరావతికి బయలుదేరి వెళ్లారు.