Vizianagaram District: విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు సోమవారం పర్యటించనున్నారు. గుర్లలో అతిసారం ప్రబలిన క్రమంలో ఆ గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితుల పై సమీక్షిస్తారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం లో డయేరియా విలయతాండవం చేస్తుంది. వాంతులు, విరేచనాలతో నాలుగు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియా ను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు అక్కడ పర్యటించనున్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా ఎమర్జెన్సీ కింద నిధులు మంజూరు చేసి సమస్యను పరిష్కరిస్తామని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఇప్పటికే ఓసారి సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాజాగా మరోసారి కూడా సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితి, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. అయితే ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.