Collectors Conference : ఈ అక్ర‌మాల‌ను అరిక‌ట్ట‌డం కలెక్టర్ల బాధ్యత కాదా ? : పవన్ కళ్యాణ్

ఇన్నేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Pawan Kalyan

Collectors-Conference : రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్‌లో కూడా కల్తీ పెరిగిపోతోందని, స్వయానా మంత్రి నాదెండ్ర మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇన్నేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ షిప్‌లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

మీ పని మీరు చేస్తే చాలు.. మిగిలింది ప్రభుత్వం చూసుకుంటుందని ఐఏఎస్, ఐపీఎస్ ల పనితీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు గొప్ప విజన్ తో పాలన సాగిస్తుంటే, అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్లిపోయాయని, వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి విభేదాలను ప‌క్కన పెట్టాల‌ని సూచించారు. తాము కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజలకు ఇబ్బందులని తొలగించాలని కూటమి కట్టామని గుర్తు చేశారు.

కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి, మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్యం రవాణా జరుగుతుందని ఎవరిని నిందించాలో అర్థం కావట్లేదని పవన్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కాకినాడ పోర్టులో ఎలా కసబ్ ఎంటర్ అయ్యాడో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నాడు జరిగిన సంఘటన వల్ల 300 మంది ప్రాణాలు పోయారని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అక్ర‌మాల‌ను అరిక‌ట్ట‌డం కలెక్టర్ల బాధ్యత కాదా ? ఎస్పీ బాధ్యత కాదా ? ఎలా వదిలేశారు ? చాలా నిరాశాజనకంగా ఉంది అంటూ పవన్‌ మండిపడ్డారు. తాము నిస్వార్థంగా ప్రజలకోసం పని చేస్తున్నా మీ సహకారం ఉండట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలనిపవన్ కళ్యాణ్ సూచించారు.

Read Also: Rahul Gandhi : పార్లమెంట్‌ ఆవరణలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన..

  Last Updated: 11 Dec 2024, 03:02 PM IST