Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే 96ఏళ్ల ఆ వృద్ధురాలికి ఎంతోప్రేమ. ఎన్నికల్లో పవన్ విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి మొక్కుకుంది. పవన్ కల్యాణ్ విజయం సాధించడంతో ఆమెకు వచ్చిన పింఛన్ ను నెలనెలా కొద్దికొద్దిగా దాచుకుంటూ ఇటీవల మొక్కులు తీర్చుకుంది. అయితే, ఆ వృద్ధురాలికి పవన్ కల్యాణ్ తో కలిసి భోజనం చేయాలని కోరిక. ఈ విషయం తెలుసుకున్న పవన్.. ఆమెను తన క్యాంప్ కార్యాలయంకు పిలిపించుకొని ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆమెకు చీరను పెట్టి లక్ష రూపాయల నగదును అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96ఏళ్ల పోతుల పేరంటాలుకు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మీద అభిమానం. గత ఎన్నికల్లో ఆయన విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకుంది. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించడంతో తన పింఛను సొమ్ము నుంచి నెలనెలా రూ.2,500 చొప్పున పోగుచేసి, రూ.27వేలతో గరగ చేయించి అమ్మవారికి సమర్పించింది. అయితే, ఆమెకు పవన్ కల్యాణ్ తో కలిసి భోజనం చేయాలని కోరిక.
ఈ విషయం తెలిసిన వెంటనే పోతుల పేరంటాలును పవన్ కల్యాణ్ తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆమె కోరిక మేరకు ఆవిడతో కలిసి భోజనం చేశారు. ఆమెకు దగ్గరుండి భోజనం వడ్డించారు. అనంతరం పేరంటాలుకు చీరను, లక్ష రూపాయల నగదును పవన్ కల్యాణ్ స్వయంగా అందజేశారు. పవన్ కల్యాణ్ వృద్ధురాలిపట్ల చూపిన ప్రేమాభిమానాన్ని చూసి జనసైనికులు, పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.