Site icon HashtagU Telugu

Pawan Kalyan : ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్లు.. పంచాయతీరాజ్‌ శాఖపై పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వాలని, ఆదాయ ప్రాతిపదికతో పాటు జనాభా ప్రాతిపదికనను కూడా తీసుకుంటూ కొత్త గ్రేడ్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు జరుగుతుందని, గ్రామ పంచాయతీ , సచివాలయ సిబ్బందితో సమన్వయంగా పని చేయాలని, దీనిపై సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

పవన్‌ కల్యాణ్‌ గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందించాలని, ఇందుకోసం సిబ్బంది లేమి సమస్యను అధిగమించాలని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు తీసుకురావాలని, కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. గతంలో పంచాయతీల ఆదాయం ఆధారంగా మాత్రమే క్లస్టర్ గ్రేడ్లు విభజించబడేవి, కానీ కొత్త విధానంలో జనాభాను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

Bhairavam : సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్న ”భైరవం” టీజర్‌

ఈ సమీక్షలో పాత క్లస్టర్ వ్యవస్థ వల్ల సిబ్బంది నియామకంలో ఏర్పడిన ఇబ్బందులు కూడా చర్చకు వచ్చాయి. ఆదాయం ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా తక్కువగా ఉండడం, ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో జనాభా ఎక్కువగా ఉండడం వల్ల సిబ్బంది నియామకంలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త క్లస్టర్ గ్రేడ్ల విభజన విధానంపై చర్చ జరిగింది.

వీటికి సంబంధించి, పంచాయతీ సేవల విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని, గ్రామ పంచాయతీల ప్రాథమిక బాధ్యతలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది నియామకంపై చర్చించారు.

కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై సిఫార్సులు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ 26 జిల్లాల్లోని పంచాయతీల ఆదాయ, జనాభా ఆధారంగా నివేదికలను సేకరించి, రాష్ట్ర కమిటీ ద్వారా పరిశీలించి, పంచాయతీల క్లస్టర్ గ్రేడ్లను ప్రభుత్వానికి నివేదించనుంది.

AP Politics : నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం.. స్పందించిన టీడీపీ అధిష్టానం

Exit mobile version