Deputy CM Pawan Kalyan letter to CM Chandrababu : సీఎం చంద్రబాబుకు..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ రాశారు. క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. దీంతో ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. క్యాంప్ కార్యాలయం మార్పునకు ఆమోదం తెలపాలని లేఖలో కోరారు పవన్.
ఇంటినే క్యాంప్ కార్యాలయంగా వాడుకోవాలని నిర్ణయం..
ప్రస్తుతం విజయవాడలోని ఇరిగేషన్ భవనాన్ని…పవన్ క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. తనకు ఆ భవనాన్ని కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు పవన్. ఇప్పుడు ఇంటినే క్యాంప్ కార్యాలయంగా వాడుకోవాలని నిర్ణయించుకోవడంతో.. విజయవాడలో తనకు కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్స్‌ను వెనక్కి తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఫర్నిచర్ తో సహా భవనం వెనక్కి..
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ కు విజయవాడలోని జలవనరులశాఖకు చెందిన గవర్నర్ పేట క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మొదట్లో ఇక్కడకు వచ్చిన పవన్.. ఆ తర్వాత మాత్రం క్రమంగా దూరమయ్యారు. ప్రస్తుతం మంగళగిరిలోని తన నివాసంలోనే ఎక్కువగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఫర్నిచర్ తో సహా భవనం వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పవన్ అందులో తెలిపారు.
బెజవాడ క్యాంపు కార్యాలయం కలిసి రాదనే ప్రచారం..
అంతేకాక.. ఈ క్యాంపు కార్యాలయానికి నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. ఇందులో గతంలో ఉన్న మంత్రులంతా ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై పదవులు కోల్పోయారు. వీరిలో కొందరు రాజకీయంగా అప్రాధాన్యంగా మారిపోయారు కూడా. వీరిలో టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీరంతా తమ హయాంలో ఈ ఆఫీసునే నివాసంగా మార్చుకుని ఉన్నారు. కానీ ఆ తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. దీంతో వాస్తుపరంగా మంత్రులకు బెజవాడ క్యాంపు కార్యాలయం కలిసి రాదనే ప్రచారం ఉంది.
Read Also: Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ