ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో విభిన్నమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. ప్రచార హడావిడికి దూరంగా ఉండి, పద్ధతి ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కేంద్ర పథకాలు సక్రమంగా అమలుకాలేదని గుర్తించిన ఆయన, వాటి లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మందగించడాన్ని గుర్తించి, ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేస్తూ గ్రామాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా మరో ముఖ్యమైన కేంద్ర పథకం అయిన జల్ జీవన్ మిషన్ అమలుపై శుభవార్త తెలిపారు.
Diwali Celebration : సమంత దీపావళి సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకుందో తెలుసా..?
ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను ప్రవేశపెట్టింది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం లక్ష్యాలు దెబ్బతిన్నాయి. దీనిని పునరుజ్జీవింపజేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సర్కారు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, కేంద్రానికి పథకం గడువు పొడిగించాల్సిందిగా అభ్యర్థించారు. దీనికి అనుగుణంగా కేంద్రం జల్ జీవన్ మిషన్ గడువును మరో నాలుగేళ్ల పాటు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాలలో దాదాపు రూ. 7,910 కోట్ల రూపాయల విలువైన తాగునీటి ప్రాజెక్టులు కొనసాగనున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది ప్రజలకు రక్షిత తాగునీరు అందే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మెగా తాగునీటి ప్రాజెక్ట్ భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉండనుంది. గత జూలై 4వ తేదీన రూ. 1,290 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే 30 సంవత్సరాలపాటు 1.21 కోట్ల మందికి రక్షిత నీరు అందించాలన్న లక్ష్యం ఉంది. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఇది జీవనదాయకంగా మారనుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాలలో కూడా తాగునీటి మెగా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ — “జనం దాహార్తి తీర్చడమే నిజమైన సేవ” అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.