ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో ఈ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం రాత్రి 11:30 నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరగా.. 2 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. వినాయక గుడి వద్ద ఉన్న క్యూలైన్లో భక్తుల బారులు తీరారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని సీపీ కాంతిరాణా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు సుమారు 4 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని అధికారులు అంచాన వేస్తున్నారు. ఇటు ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఇంద్రకీలాద్రికి రానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొండపైకి ఎలాంటి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.
Also Read: Indrakeeladri : దుర్గమ్మ దర్శనం కోసం అమ్మ దయ ఉన్న.. అధికారుల దయ ఉండాల్సిందేనా..?