Site icon HashtagU Telugu

TDP – Janasena: టిడిపి – జ‌న‌సేన మ‌ధ్య ఢిల్లీ గిల్లుడు

CBN Turning Point

Delhi Tussle Between Tdp Janasena

TDP – Janasena : తాజా రాజ‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ప్ర‌తిప‌క్ష‌పార్టీలైన తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం దాదాపుగా ఖారారైన‌ట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య జాతీయ‌పార్టీ బిజేపీ అడ్డుత‌గిలే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశంపార్టీ , జ‌న‌సేన విడివిడిగా పోటీ చేశాయి. దీంతో టిడిపి కేవ‌లం 23 సీట్లు గెలుచుకోగా జ‌న‌సేన పార్టీ ఒక సీటు గెలుచుకొని అసెంబ్లీలో అడుగుపెట్టింది. అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ 151 సీట్లను సాధించ‌డం విశేషం. గ‌త ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకోవ‌డంతో పాటు అధికార వైకాపా అవ‌లంభిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఏకైక లక్ష్యంతో ఇప్పుడు తెలుగుదేశంపార్టీ, జ‌న‌సేన‌లు క‌లిసి పోటీ చేయాల‌ని ఏకాభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లు ఇరుపార్టీల నేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి.

కానీ 2014 ఎన్నిక‌ల త‌రువాత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జాతీయ పార్టీ అయిన బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డంతో ఇప్పుడు జ‌న‌సేనాధ్య‌క్షుడు పొత్తుల విష‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. త‌ప్ప‌నిస‌రిగా బీజేపీ అనుమ‌తి తీసుకోవాల్సిందే అన్నట్లు త‌యారైంది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న స‌మయంలో కేంద్ర బీజేపీ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో పూర్తి గా స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పి, 2015 నాటికి వ‌ర‌కూ అదే హోదా అంశాన్ని ప‌దేప‌దే వ‌ల్లె వేస్తూ… 2016 నాటికి ప్ర‌త్యేక హోదా లేదంటూ మాట మార్చ‌డంతో తెలుగుదేశం పార్టీకి బిజేపీకి మ‌ధ్య ఉన్న స‌త్సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు టిడిపి (TDP) పేరు చెబితేనే బిజేపీ నిప్పులు చెరుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో టిడిపి 175 స్థానాల్లో పోటీ చేసింది. ఆ స‌మ‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు బీజేపీ కేంద్ర క‌మిటీపైన‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పైనా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో బీజేపీ-టిడిపిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా రాజ‌కీయ దుమారం చెల‌రేగింది.

ఈనేప‌థ్యంలో తెలుగుదేశం-జ‌న‌సేన పార్టీలు ఇప్పుడు 2024 ఎన్నిక‌ల్లో జ‌త‌క‌ట్టాలంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బీజేపీతో వైరాన్ని కొనితెచ్చుకోవాల్సిందేనా..? అనే సందేహాలు క‌లుగుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనాలంటే త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తిప‌క్ష‌పార్టీలు అన్నీ ఏక‌తాటిపైకా వ‌చ్చి ఒక అవ‌గాహ‌న‌తో క‌లిసి ప‌నిచేస్తేనే అధికార మార్పిడి సాధ్య‌మ‌వుతుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష‌పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వైరుధ్యాలు ఏం ఉన్నా.. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో కుల రాజ‌కీయాలకు ప్రాధాన్య‌త పెరిగిపొంద‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అధికార‌మా…? కుల రాజ‌కీయాలా..? అన్న మీమాంసంలో నేత‌లు కొట్టుమిట్టాడుతున్నారు.

అధికార‌పార్టీ వైకాపా మాత్రం 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. త‌మ‌పార్టీ అమ‌లు చేసిన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను తిరిగి అధికార‌పీఠాన్ని ఎక్కిస్తాయ‌ని పూర్తి విశ్వాసంతో ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైతే త‌మ భ‌విష్య‌త్తు పూర్తిగా అంథ‌కారం అవుతుంద‌నే భ‌యాందోళ‌న‌లో టిడిపి (TDP), జ‌న‌సేన పార్టీలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఓటర్ల తీర్పు ఏవిధంగా ఉంటుంద‌నే విష‌యంలో ఇప్ప‌టికిప్పుడు అంచ‌నాలు వేయ‌డం ఎంతో క‌ష్టం. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో జ‌రగ‌బోయే ప‌రిస్థితులు, ప్ర‌భుత్వం చేప‌ట్టే ప‌నులు, ప్ర‌తిప‌క్ష‌పార్టీ అధికార‌పార్టీపై చేసే విమ‌ర్శ‌ల‌కు త‌గిన ఆధారాల‌తో ప్ర‌జాక్షేత్రంలోకి అడుగు పెట్టాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. రాజ‌కీయ‌పార్టీలు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ప్రాధాన్య‌త ఇస్తారా..? లేక ఏలాగైనా స‌రే అధికార‌పీఠాన్ని అధిరోహించాల‌నే ఒకేఒక్క త‌ప‌న‌తో త‌మ ఇష్టానుసార‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటే ఎన్నిక‌లు ర‌ణ‌రంగంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష‌పార్టీ మ‌ధ్య ఉన్న చిన్న‌చిన్న స్ప‌ర్ధ‌ల‌ను తుంచివేయ‌డం ఇప్పుడు ముందున్న క‌ర్త‌వ్యం.

పొత్తు పొస‌గాలంటే విభేదాలకు స్వ‌స్తి చెప్పాల్సిందే. మ‌రి నేత‌లు మ‌దిలో ఏముందో మ‌న‌కేం తెలుసు..? రాజ‌కీయ నేత‌ల ఊహ‌ల‌కు… త‌ప్పిదాల‌కు త‌గిన బుద్ది చెప్పాలంటే.. ఓట‌ర్లు ఎంతో సంయ‌మ‌నంతో.. ఆలోచ‌నా విధానంతో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వ్వాలి. కేవ‌లం ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీలు మాత్ర‌మే వ్యూహాలు ర‌చించ‌డం కాదు.. త‌మ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే నేత‌ల‌ను ఎన్నుకోవ‌డానికి ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తీ ఓట‌రూ ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించి త‌మ ఓటు హ‌క్కును స‌ద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఓటున్న ప్ర‌తీ ఒక్క‌రూ ఓటింగులో పాల్గొనాల్సిందే. అప్పుడు రాజ‌కీయ‌పార్టీల మ‌ధ్య పొత్తులు పొసిగినా..? పొడ‌చూపినా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం ఎలాంటి న‌ష్టం క‌ల‌గ‌ద‌నేది య‌దార్ధం.

Also Read:  GT vs KKR IPL 2023: రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌.. గుజరాత్‌ పై కోల్‌కతా స్టన్నింగ్ విక్టరీ..