Site icon HashtagU Telugu

Vijayawada: సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న విజయవాడ

Vijayawada

New Web Story Copy 2023 09 05t150242.278

Vijayawada: విజయవాడ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పాత వీధి దీపాలను మార్చి నగరమంతటా అలంకారమైన వీధి దీపాలను ఏర్పాటు చేస్తోంది. రోడ్డు డివైడర్లపై ఏర్పాటు చేస్తున్న కొత్త డెకరేటివ్ లైట్లు నగరానికి అందాన్ని సంతరించుకోనున్నాయి. మొదటి దశలో అధికారులు ఈ లైట్లను బందర్ రోడ్ బెంజ్ సర్కిల్ నుండి బస్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో స్తంభానికి కలిపి రూ.1.30 లక్షలు ఖర్చవుతుండడంతో వీఎంసీ రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ లైట్లను బెంగళూరు నుంచి కొనుగోలు చేశారు. రెండు నెలల క్రితమే పనులు ప్రారంభించిన అధికారులు అక్టోబర్ 10 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.విజయవాడ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్, ప్లాస్టిక్, కాలుష్య రహితంగా ఉంచాలనే లక్ష్యంతో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ నగరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వీఎంసీ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు దోమల బెడదను నివారించేందుకు, నీటి కాలుష్యం లేకుండా చేసేందుకు అధికారులు కాలువలను శుభ్రం చేస్తున్నారు. అంతే కాకుండా నగరంలోని పలు పార్కులను అవసరమైన సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.

ప్రస్తుతం 5.2 కిలోమీటర్ల మేర 126 అలంకార విద్యుత్‌ స్తంభాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్తంభంపై రెండు లైట్లు ఉన్నాయి. లైట్ సామర్ధ్యం 180 వాట్స్. కొత్తగా ఏర్పాటు చేసిన స్తంభాలు స్వచ్ఛమైన అల్యూమినియంతో మరియు తుప్పు పట్టకుండా తయారు చేయడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ ఎలక్ట్రికల్‌ డీఈ ఫణీంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. నగరానికి కొత్త రూపురేఖలు తీసుకొచ్చేందుకు అలంకరణ దీపాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇనుముతో నిర్మించిన పాత స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. పాత స్తంభాలతో పోలిస్తే, కొత్త స్తంభాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి మరియు ఎక్కువ కాంతిని ఇస్తాయి. తొలగించిన పాత స్తంభాలను నగరంలో మరికొన్ని చోట్ల వినియోగించనున్నారని తెలిపారు.

Also Read: Swarupanandandra : స‌నాత‌న‌ధ‌ర్మంపై జ‌గ‌న్ `ఆత్మ‌` ఘోష‌!