Jonnagiri Gold Mine : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని ఏర్పాటవుతోంది. తుగ్గలి మండలంలోని ఎర్రగుడి, పగడిరాయి, జొన్నగిరి గ్రామాల మధ్య ఈ గోల్డ్ మైన్ ఉంటుంది. వచ్చే ఏడాది చివరికల్లా ఇందులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈవిషయాన్ని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) ఎండీ హనుమా ప్రసాద్ వెల్లడించారు. ఈ గోల్డ్ మైన్ లో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రతి సంవత్సరం దాదాపు 750 కిలోల గోల్డ్ ను వెలికితీయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
బీఎస్‌ఈలో నమోదైన ఒకే ఒక్క పసిడి వెలికితీత కంపెనీ డీజీఎంల్.. ఇక్కడ మైనింగ్ ను నిర్వహించనుంది.జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌లో 40 శాతం వాటా కలిగిన డీజీఎంఎల్ జొన్నగిరిలో తొలి ప్రైవేటు రంగ గోల్డ్ మైన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ పసిడి గనిలో ఇప్పటికే రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం నెలకు ఒక కిలో బంగారాన్ని వెలికి తీస్తున్నారు. 2013లోనే ఈ గోల్డ్ మైన్ కు అనుమతి లభించగా, దాని వెలికితీతకు దాదాపు పదేళ్లు టైం పట్టింది. గనిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు కిర్గిజ్‌స్థాన్‌లోనూ ఒక గోల్డ్ మైన్ ఉంది. అక్కడి బంగారు గని ప్రాజెక్ట్‌లో కంపెనీకి 60 శాతం వాటా ఉంది. అక్కడ కూడా వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి ఉత్పత్తి (Jonnagiri Gold Mine) ప్రారంభమవుతుంది. కిర్గిజ్‌స్థాన్‌లోని ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయనుంది.