Jagan సర్కార్‌కి గడువు! చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు!

ఏపీ ప్రభుత్వానికి టీడీపీ (TDP) అధినేత పెట్టిన డెడ్ లైన్ సోమవారంతో ముగుస్తుంది.

  • Written By:
  • Updated On - May 7, 2023 / 11:07 PM IST

Jagan Government: ఏపీ ప్రభుత్వానికి టీడీపీ (TDP) అధినేత పెట్టిన డెడ్ లైన్ సోమవారంతో ముగుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు 70 నియోజకవర్గాల పరిధిలో అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగిందని చంద్రబాబు గుర్తించారు. నష్టపోయిన రైతులకు పరిహారం, పంట భీమా కింద వచ్చే మొత్తం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ శనివారం ప్రభుత్వానికి 72 గంటల డెడ్ లైన్ పెట్టారు.

ఆ గడువు సోమవారం సాయంత్రం తో ముగుస్తుంది. ప్రభుత్వం దిగిరాకపోతే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగనున్నారు. ఈ నెల 13న నిరసన దీక్షకు రైతులతో కలసి చంద్రబాబు దీక్షకు దిగుతారు. అంతే కాదు గోదావరి జిల్లాలో పాదయాత్రకు దిగాలని యోచిస్తున్నారు.
పంట బీమా ప్రీమియంను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రీమియం చెల్లించాలి. రబీ కి భీమా ప్రీమియం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. ఫలితంగా అకాల వర్షానికి పంట నష్ట పోయిన రైతులకు భీమా వచ్చే పరిస్థితి లేదు. పంట నష్టంలో కనీసం 40 శాతం తక్షణం ప్రభుత్వం చెల్లించాలని చంద్రబాబు మొదటి డిమాండ్. ఇక పంట నష్టం కు వచ్చే భీమా మొత్తం రైతులకు ఇవ్వాలి అనేది రెండో డిమాండ్. ధాన్యం తడిసిన కారణంగా బస్తాకు 300 రూపాయలు నష్టంగా లెక్కించి ఆ మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని మూడో డిమాండ్ గా జగన్ ప్రభుత్వం ముందు ఉంచారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, 40 నుంచి 50 శాతం పంట ఇంకా పొలాల్లో ఉందని చంద్రబాబు అంచనా. వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారని, మిగిలిన పంట కల్లాల్లోనే ఉందని ఆయన గత వారం చేసిన పర్యటనలో తేల్చారు. వీటికి పరిష్కారం చూపకపోతే దీక్షకు దిగడానికి చంద్రబాబు సిద్ధం అయ్యారు. ఈ నెల 13న దీక్ష తరువాత పెందుర్తి, అనకాపల్లి, ఎస్.కోట ప్రాంతాల్లో మే 16, 17, 18 తేదీల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రకటించారు.

ఆదివారం విలేకరుల సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల అనేక మంది రైతులు నష్టపోయిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన భోగారపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే పనిలో జగన్ మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు.ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జిల్లా అధికారులు కానీ ఇప్పటి వరకు నష్టపోయిన రైతులను పరామర్శించలేదని, నష్టాలపై ఆరా తీయలేదని ఆరోపించారు. వర్షాల వల్ల రైతులు నష్టపోయిన ఆర్థిక సాయం కోసం కేంద్రానికి తెలిపినా జగన్ పట్టించుకోలేదని వెంకన్న అన్నారు.
రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనే ఉద్దేశ్యంతో కాదు, ఈ ప్రాంతాన్ని దోపిడీ చేయాలనే ఉద్దేశంతో జగన్ విశాఖపట్నంకు మారాలని యోచిస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు.
విశాఖపట్నం-ఇచ్ఛాపురం మధ్య తీరప్రాంతంలో తన రిసార్ట్స్ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని జగన్ భావిస్తున్నారని ఆరోపించారు.జగన్ రాకముందే ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన పోలీసు సిబ్బందిని ఉత్తర ఆంధ్ర ప్రాంతానికి మోహరించారని,బదిలీ చేస్తున్నారని టీడీపీ నాయకుడు ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో జగన్‌కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రైతులు మంగళవారం రోడ్లు మీదకు రావాలని, టీడీపీ చేసే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. మొత్తం మీద సోమవారం నుంచి చంద్రబాబు దూకుడు పెంచుతూ రైతులకు న్యాయం కోసం ఆందోళన కార్యక్రమాలను జగన్ మెడలు వంచేలా మరో రూపంలోకి తీసుకెళ్ల బోతున్నారు.

Also Read : GT vs LSG Highlights: హోంగ్రౌండ్‌లో దుమ్మురేపిన గుజరాత్‌.. లక్నోపై ఘనవిజయం