Data Theft Issue: చంద్రబాబు హయాంలో డేటా చోరీపై స్పీక‌ర్‌కు నివేదిక…నేడు అసెంబ్లీలో చర్చ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై శాస‌న‌స‌భ‌కు హౌస్‌ కమిటీ నివేదిక సమర్పించింది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 08:32 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌పై శాస‌న‌స‌భ‌కు హౌస్‌ కమిటీ నివేదిక సమర్పించింది.
శాసనసభ గ్రంథాలయ హాల్‌లో హౌస్‌ కమిటీ సోమవారం సమావేశమైంది. హౌస్ క‌మిటీ చైర్మ‌న్‌ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స‌భ్యులు పార్థసారథి, అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్ రావు, జక్కంపూడి రాజా పాల్గొన్నారు. పెగాసస్ తో పాటు ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యంపై కమిటీ చర్చించింది. గతంలో రెండుసార్లు సమావేశమైన ఈ క‌మిటీ డేటా చౌర్యం జరిగినట్లు నిర్దారణకు వచ్చింది. వైసీపీ నాయకుల డేటా పలు ఐపీ అడ్రస్‌లకు వెళ్లినట్లు కమిటీ గుర్తించింది. దీనికి సంబంధించి 85 పేజీల నివేదికను భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అందజేశారు.

ఈ సందర్భంగా హౌస్ కమిటీ సభ్యుడు జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు ప్రాథమిక నివేదికను స్పీకర్‌కు అందజేసినట్లు చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్ర విచారణ జరగవలసి ఉందన్నారు. ఈ నివేదికపై ఈ రోజు శానసభలో చర్చించే అవకాశం ఉందని జ‌క్కంపూడి రాజా చెప్పారు. శాసనసభ గత బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఫోన్ ట్యాపింగ్‌‌పై దుమారం చెలరేగింది. వైసీపీ, టీడీపీ సభ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్వివాదం జ‌రిగింది. చివ‌ర‌కు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం భూమన కరుణాకర రెడ్డిని చైర్మన్ గా హౌస్ క‌మిటీని ఏర్పాటు చేశారు.

రాజ‌కీయ ల‌బ్ది కోసం గ‌త ప్ర‌భుత్వం డేటా చౌర్యానికి పాల్ప‌డిన‌ట్లు హౌస్ క‌మిటీ ఆరోపించింది. చంద్ర‌బాబు, లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే వ్య‌క్తుల డేటా ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్లిన‌ట్లు చెప్పింది. అప్ప‌టి ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్టాల‌నే ఉద్దేశంతోనే కుట్ర జ‌రిగింద‌ని క‌మిటీ స‌భ్యులు ఆరోపించారు. సేవామిత్ర అనే అప్లికేష‌న్ ద్వారా 30 నుంచి 40 ల‌క్ష‌ల మంది డేటాను సేక‌రించిన‌ట్లు కమిటీ తేల్చింది. గ‌త ప్ర‌భుత్వంలో ఐటీ శాఖ కార్య‌ద‌ర్శి విజ‌యానంద్, ఆర్టీజీఎస్ అప్ప‌టి సీఈవో అహ్మ‌ద్ బాబును కూడా క‌మిటీ విచారించింది.